Chanakya Niti: కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తందంటారు. మన వివాహ వ్యవస్థపై విదేశీయులు సైతం మోజు పడతారు. మన బంధాలను వారు ఎంతో ఇష్టపడతారు. ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం విడిపోకుండా ఉండటమంటే మాటలు కాదు. దానికి చాలా సహనం కావాలి. ఎంతో ఓపిక ఉండాలి. జీవిత భాగస్వామికి కడదాకా తోడుండే సందర్భంలో వివాహం చేసుకునేటప్పుడే మన భాగస్వామి ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. లేదంటే జీవితం నరకమే. ఎల్లప్పుడు బాధలతో సంసారం చేస్తే మనకు దుఖమే తప్ప సుఖం ఉండదు. అదే అర్థం చేసుకునే అర్థాంగి ఉంటే పేదరికమైనా స్వర్గమే. అదే అపార్థం చేసుకునే భార్య ఉంటే కోట్లున్నా నరకమే. రోజంతా ఏదో గొడవ పడే బదులు జీవితాలను మధ్యలోనే ముగించేవారుండటం తెలిసిందే.

అందుకే మన జీవితభాగస్వామి ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అంతర్గత సౌందర్యానికి పెద్దపీట వేయాల్సిందే. మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ సైతం బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యమే గొప్పదని చెప్పడం గమనార్హం. మన జీవిత భాగస్వామి అంతగా అందంగా లేకున్నా ఫర్వాలేదు కానీ అందమైన మనసుంటే చాలు. అలాగైతేనే మన జీవితం సుఖంగా సాగుతుంది. అదే అర్థం చేసుకోకపోతే నరకమే. బతుకుమీద కూడా అసహ్యం వేస్తుంది. చివరకు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితి వస్తుంది.
జీవితంలో జీవితభాగస్వామిని ఎంపిక చేసుకునే సమయంలో ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు. నిదానంగా ఆలోచించి ఆమె మనకు సరిపోతుందా లేదా అనేది బేరీజు వేసుకుని తరువాత నిర్ణయం తీసుకోవాలి. ఎవరో బంధువులు ఒత్తిడి చేస్తున్నారని ఎవరైతే ఏంటి అనే ధోరణిలో భాగస్వామిని ఎంచుకుంటే ఇక భవిష్యత్ నరకమే. అందుకే సాధ్యమైనంత వరకు ఏ నిర్ణయమైనా నిదానంగా ఆలోచించి తీసుకోవాలే కాని ఎవరి కోసమో మన జీవితాన్ని బలి చేయొద్దు. మంచి భాగస్వామి దొరికే వరకు ఎదురుచూడటం ఉత్తమం.
ఆధ్యాత్మిక విషయాల్లో కూడా జీవితభాగస్వామికి తగిన శ్రద్ధ ఉండాలి. దేవుడి సేవలో తరించే వారు ఎక్కువగా అశ్లీల పదాలు వాడరు. వారికి భక్తిభావమే మంచి మార్గంగా తోస్తుంది. అందుకే ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. ఊరకే చీటిపోటి మాటలు పలకరు. దేవుడిపై భక్తితో ఉంటే వారిలో మంచి గుణమే అలవడుతుంది. తద్వారా మనకు కూడా ప్రశాంతత కలుగుతుంది. ఆచార సంప్రదాయాలు పాటించే వారు ఆగమాగం కారు. అన్ని విషయాలు నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంతో మనకు కూడా ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది.
ఆడవారికైనా, మగవారికైనా ముఖ్యంగా ఉండాల్సింది సహనం. అది కోల్పోతే కష్టమే. గొడవలు ముదిరి విభేదాలు పెరుగుతాయి. తద్వారా మన సంసారం కూడా కకావికలం అవుతుంది. అందుకే సహనం ఉన్న వ్యక్తులనే తమ భాగస్వాములుగా ఎంచుకుంటే మంచిది. ఎలాంటి విషయాల్లో అయినా తప్పు ఎక్కడ ఉందో గుర్తించి దాని నివారణకు కృషి చేస్తే సరిపోతుంది. అంతేకాని సహనం నశిస్తే ఇక జగడమే. మాటలతో యుద్ధమే. సాధ్యమైనంత వరకు మనలో సహనం గతి తప్పకుండా చూసుకోవాలి. ఇవన్నీ ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో బోధించాడు. జీవిత భాగస్వామి ఎంపికలో తొందరపాటుగా కాకుండా మంచి ఆలోచన కలిగి ఉంటేనే మనకు మంచి వారు దొరుకుతారని చెబుతున్నాడు. వీటిని పెళ్లి చేసుకోవాలనుకునే వారు పాటించి తమ జీవితాలను నందనవనం చేసుకోవాలని సూచిస్తున్నారు.
Recommended Videos



