Adani Hindenburg Case: అదానీ-హిండెన్‌బర్గ్‌ కేసులో కీలక పరిణామం.. సెబీ ఏం చేయనుంది?

మరోవైపు స్టాక్‌ మార్కెట్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 4.50 శాతానికి పైగా నష్టపోతున్నాయి. ఇదే క్రమంలో అదానీ పోర్ట్‌ అండ్‌ సెజ్‌ స్టాక్‌ 2.75 శాతం పడిపోయింది. అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ టోటల్‌ గ్యాస్, అదానీ విల్మార్‌ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి.

Written By: Raj Shekar, Updated On : August 14, 2023 4:27 pm

Adani Hindenburg Case

Follow us on

Adani Hindenburg Case: అదానీ–హిండెన్‌ బర్గ్‌ కేసులో సెబీ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే తన దర్యాప్తు నివేదికను అందించటానికి కాదు. ఈ అంశంపై తగిన చర్యలు తీసుకున్నామని, 15 రోజుల తర్వాత నివేదికను అందజేస్తామని మార్కెట్‌ రెగ్యులేటర్‌ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దరఖాస్తులో పేర్కొంది. దీనికి ముందు సుప్రీంకోర్టు సెబీకి ఆగస్టు 14 వరకు గడువు ఇచ్చింది. అలాగే ఆగస్టు 29ని విచారణ తేదీగా నిర్ణయించింది. అంటే ఆగస్టు 29న సెబీ ఈ అంశంపై తుది నివేదికను సమర్పించనుంది.

పడిపోయిన అదాని షేర్లు..
ఇదిలా ఉండగా ప్రఖ్యాత అకౌంటింగ్‌ సంస్థ అదానీ పోర్ట్స్‌ కంపెనీ చట్టబద్ధమైన ఆడిటర్‌ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోమవారం మార్కెట్ల ఇంట్రాడే ట్రేడింగ్‌ సమయంలో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్‌ విలువ పడిపోయింది. రాజీనామా చేయడానికి ముందు డెలాయిట్‌ అమెరికన్‌ షార్ట్‌ సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ ఆరోపణలపై స్వతంత్ర బాహ్య విచారణకు పిలుపునిచ్చింది. అయితే ఆరోపణలు తమ ఆర్థిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపలేదని, డెలాయిట్‌ రాజీనామాకు గల కారణాలు సంతృప్తికరంగా లేవని అదానీ పోర్ట్స్‌ పేర్కొంది.

మదుపర్లకు నష్టం..
మరోవైపు స్టాక్‌ మార్కెట్లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు 4.50 శాతానికి పైగా నష్టపోతున్నాయి. ఇదే క్రమంలో అదానీ పోర్ట్‌ అండ్‌ సెజ్‌ స్టాక్‌ 2.75 శాతం పడిపోయింది. అదానీ పవర్, అదానీ గ్రీన్, అదానీ టోటల్‌ గ్యాస్, అదానీ విల్మార్‌ షేర్లు 2 శాతానికి పైగా పడిపోయాయి. అదానీ ట్రాన్స్‌మిషన్‌ షేర్లు 3.50 శాతం పతనమయ్యాయి. ఇక సిమెంట్‌ కంపెనీల విషయానికొస్తే.. ఏసీసీ షేర్లు 2 శాతం, అంబుజా సిమెంట్‌ షేర్లు 3.50 శాతం పడిపోగా.. ఎన్‌డీటీవీ షేర్ల విలువ 1.5 శాతం పడిపోయింది. దీంతో మదుపరులు నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో హిండెన్‌బర్గ్‌ నివేదిక సమయంలో దాదాపు ఆరు నెలలపాటు అదాని షేర్లు పతనమయ్యాయి. దీంతో టాప్‌ 3 ఉన్న అదాని.. టాప్‌ 10లో కూడా లేకుండా పోయారు. తర్వాత కోలుకున్నాయి. ఇప్పుడిప్పుడే అదాని కంపెనీలు గాడిన పడుతుండగా, మళ్లీ సెబీ సమయం కోరడం, సుప్రీం కోర్టు ఈనెల 29 వరకు గడువు ఇవ్వడంతో షేర్లు మళ్లీ క్షీణించాయి.