డీమార్ట్ వెళ్లాల్సి వచ్చింది ఒక వస్తువు అవసరమై. సమయాన్ని తినేసే డీమార్ట్‌కీ ఎవరూలేని సమయంలో, టార్గెటెడ్ పనిమీద వెళ్లి, ఎవరూలేని కౌంటర్లో బిల్ చెల్లించి వస్తుండగా ఒకమ్మాయి పరిగెత్తుకొచ్చి నా సహచరిని చుట్టేసింది. “అక్కా, నన్ను గుర్తు పట్టారా?” అని, తను బిక్కమొహమేసింది! “సార్” మీరైనా? అడుగుతోంది, సంతోషం నిండిన కళ్లతో, సహచరి చేతులు పట్టుకుని ఊపేస్తూ, నా వైపు తిరిగి.
అక్కడ పనిచేసే అమ్మాయని తెలుస్తోంది, నాకూ గుర్తురాలేదు. ఇద్దరం ఇబ్బందిపడ్డాం, అప్పుడు చెప్పింది తనెవరో..
కరోనా కాలంలో మేం సిటీలో కాకుండా టౌన్లో వున్నాం. ప్రమాదకరమైన ఆకాలంలో ఉదయాన్నే సైకిల్ పట్టుకుని ఇద్దరు పిల్లలు ఇంటిగేటు శబ్దం చేశారు. చూస్తే, నోరు, ముక్కు కనిపంచకుండా గుడ్డముక్కలు కట్టుకున్నారు. తాము పక్కన పల్లెనుండి వచ్చామని, తమ తోటలో పండిన ఆకుకూరలని, కొనమని దాదాపు ప్రాధేయపడ్డారు. వాళ్ల పరిస్థితి చూసి రోజూ కొనడం ఆరంభించడం, మేం కొనడం చూసి వీధి అంతా కొనడం జరిగేది.
ఈ ఇద్దరు పిల్లలూ అక్కాతమ్ముడు, ఆ పిల్ల 9, పిల్లాడు 7 చదువుతున్నారు, కరోనాకాలంలో తమ వాళ్లు మంచాన పడ్డారని, తిండికోసం మేమిలా చేస్తున్నామని చెప్పారు. కరోనా ముగియడం వాళ్లూ కనిపించలేదు, మేం బదిలీమీద సిటీ వచ్చాం. ఇదిగో ఆ పిల్లే ఈ పిల్ల!
“ఓహ్ గుర్తొచ్చావు, ఇక్కడేం చేస్తున్నావు?” సహచరి అడిగింది.
“నేను ఇక్కడే పనిచేస్తున్నాను. అప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం చేస్తున్నాను. ఎంతకష్టం వచ్చినా చదువుకోవాలని చెప్పినారు కదా. ఇంటరు పూర్తి చేశాను. సిటీకి వచ్చాను. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాను. పొద్దునపూట కాలేజ్‌కి వెళ్తాను. సాయంత్రం పూట ఇక్కడ పనిచేస్తాను, నా డబ్బు నేను సంపాదించుకొంటున్నాను. తమ్ముడు ఇంకా అక్కడే చదువుకుంటున్నాడు. ఇందాక సార్ గొంతు విని లోపలినుండి పరిగెత్తుకొచ్చాను”.
అనునయంగా ఒక్కమాట చెబితే, దాన్ని ఇంత పట్టుదలగా నిలబెట్టుకున్న ఆ పిల్లని చూడగానే మాకు ఓ ఎదిగిన కూతుర్ని కన్నంత సంతోషం అనిపించింది.
(ఇలాంటి లక్ష్యంతోనే ఇక్కడ రాయడం, ఇలాంటి పిల్లలే కాదు ఎంతోమంది పెద్దలు ఇలా నా ఇన్‌బాక్స్ నిండా కనిపించడం గొప్ప సంతృప్తి)