Reliance Employees: రిలయన్స్.. ఈ కంపెనీని ధీరుభాయ్ అంబానీ స్థాపించవచ్చుగాక.. దీనిని మరింత వృద్ధి బాట పట్టించింది మాత్రం ముఖేష్ అంబానీ. నా వ్యాపార చతురతతో అన్ని రంగాల్లో రిలయన్స్ ను విస్తరించాడు. పెట్రో కెమికల్స్ నుంచి దుస్తుల వరకు ప్రతి రంగంలోనూ రిలయన్స్ తన సత్తా చాటుతోంది. అలా లెక్కకు మించిన స్థాయిలో వృద్ధిరేటు నమోదు చేస్తూ తన యజమాని ముఖేష్ అంబానీని ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడిగా అవతరించేలా చేసింది. ఒకానొక దశలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే కూడా రిలయన్స్ క్యాపిటల్ వేల్యూ ఎక్కువ ఉంది అంటే దాని పరపతి ఏ విధంగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి రిలయన్స్ కంపెనీలో ఉద్యోగం చేయడం అంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అదేం విచిత్రమో తెలియదు కానీ రిలయన్స్ కంపెనీలో చాలామంది ఉద్యోగులు రాజీనామా చేస్తున్నారు.
అంతటి కోవిడ్ సమయంలోనూ రిలయన్స్ కంపెనీ తన ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది. ఆర్థిక మాంద్యం తలెత్తుతున్నప్పటికీ ఉద్యోగులకు సక్రమంగానే జీతభత్యాలు చెల్లిస్తోంది. అన్ని బాగానే ఉన్నప్పటికీ ఏకంగా 1.67 లక్షల మంది ఉద్యోగులు రాజీనామా చేయడం కార్పొరేట్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. రిలయన్స్ కంపెనీలో రిటైల్, టెలికాం కంపెనీలో చాలామంది ఉద్యోగులు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. 2022_23 ఆర్థిక సంవత్సరంలో జియోకి 41 వేల మంది, రిలయన్స్ రిటైల్లో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. రిలయన్స్ వార్షిక నివేదిక ప్రకారం సంస్థలో ఆట్రిషన్ రేటు 64.8 శాతం పెరిగింది.
ఇటీవల కాలంలో రిలయన్స్ కంపెనీ ఇతర రిటైల్ స్టార్టప్ లను కొనుగోలు చేస్తోంది. అయితే ఉద్యోగుల సర్దుబాటు, అదే సమయంలో పెరిగిపోతున్న నియామకాలను అందిపుచ్చుకునేందుకు ఉద్యోగులు సంస్థలు వెళ్ళినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. మొత్తంగా ఆర్థిక సంవత్సరం 2023 లో 1,67,391 మంది ఉద్యోగులు రిలయన్స్ నుంచి వైదొలిగారు. ఇందులో రిటైల్, జియో విభాగాలు ఉన్నాయి. సంస్థకు రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్లు, మిడ్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులు ఉన్నట్టు రిలయన్స్ ప్రతినిధులు చెబుతున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రిలయన్స్ లో కొత్త నియామకాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. ఉద్యోగులు సంస్థకు రాజీనామా చేస్తున్నప్పటికీ రిలయన్స్ 2023 ఆర్థిక సంవత్సరంలో 2,62,558 మంది ఉద్యోగులను నియమించుకుంది. కాగా, ఆగస్టు 28న మధ్యాహ్నం రెండు గంటలకు రిలయన్స్ తన 46వ వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఎక్స్చేంజి లకు సమాచారం ఇచ్చింది. ఈ ఈవెంట్ సందర్భంగా రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, రాబోయే జియో ఫోన్ 5జి, కస్టమర్ ఫోకస్ జియో 5జి ప్లాన్లు, వివిధ అంశాలపై అప్డేట్ ఇస్తుందని భావిస్తున్నారు