Zimbabwe T20 World Cup : టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు జింబాబ్వే జట్టు మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ ఆ జట్టు ఇప్పుడు సంచలన ఆట తీరుతో ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా మారిపోయింది. టి20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశను జింబాబ్వే అజేయంగా ముగించింది. గ్రూప్ బీ లో అగ్రస్థానంలో నిలిచింది.
వాస్తవానికి జింబాబ్వే జట్టు 2024 t20 వరల్డ్ కప్ కు అర్హత సాధించడం విఫలమైంది. ఆ తర్వాత ఆ జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. కెప్టెన్ సికిందర్ రాజా జింబాబ్వే జట్టును పూర్తిగా మార్చేశాడు. తద్వారా ఆటగాళ్లలో క్రీడా స్ఫూర్తి పెరిగింది. అందువల్లే జింబాబ్వే ఆటగాళ్లు బలమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించారు. కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టును 23 పరుగుల తేడాతో జింబాబ్వే ఓడించింది. జింబాబ్వే జట్టులో ముజారబాని (4/17) నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా జట్టును మాత్రమే కాదు, శ్రీలంక జట్టును కూడా జింబాబ్వే ఓడించింది. అది కూడా వారి సొంత మైదానంలో.. 6 వికెట్ల తేడాతో జింబాబ్వే గెలిచిందంటే.. వారి ఆట తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గ్రూప్ బి లో ఉన్న శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి జట్లను ఓడించి.. జింబాబ్వే అగ్రస్థానంలో నిలిచింది అంటే మాటలు కాదు. బూడిదలో నుంచి ఫినిక్స్ పక్షి పునర్జీవనం పొందినట్టు.. జింబాబ్వే జట్టు అద్భుతమైన ఆటతీరుతో సరికొత్తగా కనిపిస్తోంది. గడచిన 18 నుంచి 24 నెలల్లో జింబాబ్వే జట్టు అనేక రకాలైన వ్యూహాత్మక, నిర్మాణాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో ఆ జట్టు ఆటగాళ్ల ఆట తీరు పూర్తిగా మారిపోయింది.
శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం పెంపుదల
వెస్టిండీస్ లెజెండరీ బౌలర్ వాల్ష్ ను జింబాబ్వే బౌలింగ్ కన్సల్టెంట్ గా నియమించుకుంది. తద్వారా జింబాబ్వే జట్టు బౌలింగ్ పూర్తిగా మారిపోయింది. జస్టిన్ సామన్స్, చార్ల్ లాంగ్ వెల్డ్జ్ శిక్షణలో జింబాబ్వే జట్టు సరికొత్తగా రూపాంతరం చెందింది.
కెప్టెన్ సికిందర్ రజా
కెప్టెన్ సికిందర్ రజా జట్టులో పోరాట స్ఫూర్తిని నింపాడు. వీర స్వర్గం కాదు.. కచ్చితంగా విజయాన్ని సాధించాలని జట్టు ఆటగాళ్లకు పదేపదే చెప్పాడు. అందువల్లే జింబాబ్వే జట్టు ఇలా మారిపోయింది.
కొత్త ఆటగాళ్ల రాక
రజా, గ్రేమ్ క్రీమర్ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు తమ అనుభవాన్ని జట్టుకు అందిస్తున్నారు. బ్రియాన్ బెన్నెట్(వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు), తడి వానాషే మరు మాని వంటి యంగ్ ప్లేయర్లు దూకుడు కొనసాగిస్తున్నారు.
ఫార్మాట్ మార్చింది
జింబాబ్వే జట్టు 2025లో తనదేశానికి సంబంధించిన టి20 క్రికెట్ లీగ్ నిర్వహించింది. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ప్లేయర్లు మారడానికి రాత్రిపూట మ్యాచ్ లు నిర్వహించింది. ప్రపంచ కప్ కోసం ఆశావాహులను మరింత సమీకరించింది. టీ 20 వరల్డ్ కప్ కంటే ముందు జింబాబ్వే 2025లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్లతో సిరీస్ లు నిర్వహించడం ద్వారా.. అగ్రశ్రేణి ప్లేయర్లను జట్టుకు అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎవరి పాత్ర ఎలా ఉందంటే
సికిందర్ రజా: కెప్టెన్/ ఆల్ రౌండర్. శ్రీలంక జట్టుతో జరిగిన మ్యాచ్లో 26 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. తద్వారా చేజింగ్ లో ఊపు తెచ్చాడు.
బ్రియాన్ బెన్నెట్: శ్రీలంక జట్టుపై 63* పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆస్ట్రేలియాపై 64* దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. టి20 వరల్డ్ కప్ లో వరుసగా హాఫ్ సెంచరీలు చేసిన తొలి జింబాబ్వే ఆటగాడిగా రికార్డు సృష్టించాడు..
ముజారబానీ: ఆస్ట్రేలియాపై ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి అతను ఈ ఘనత సాధించాడు.
గ్రేమ్ క్రీమర్: లెగ్ స్పిన్నర్ గా కీలకంగా ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. మిడిల్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నాడు. శ్రీలంక జట్టు మీద రెండు వికెట్లు పడగొట్టాడు.
జింబాబ్వే జట్టు ప్రస్తుతం సూపర్ 8 లోకి ప్రవేశించింది. టీమిండియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో కలిసి పోటీ పడబోతోంది.