Andhra Pradesh politics : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుంది కూటమి. వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత నెలలో పార్లమెంట్లో పెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు వెనక్కి వచ్చిన సంగతి తెలిసిందే. మూడింట రెండో వంతు మెజారిటీ లేకపోవడంతో లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణకు గురైంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అయితే మోడీ ప్రధాని అయిన తర్వాత ఇలా బిల్లులు తిరస్కరణకు గురి కావడం ఇదే తొలిసారి. అందుకే ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ రెండు బిల్లుల విషయంలో. వచ్చే నెలలో మరోసారి ప్రవేశ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన సంఖ్యాబలం లోక్సభలో సాధించే పనిలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వచ్చారు. మహారాష్ట్రలో సైతం లోక్సభ సభ్యులు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తున్నారు. దీంతో పునర్విభజన బిల్లు లోక్సభలో పాస్ కావడం ఖాయం.
* పెరగనున్న సీట్లతో..
ప్రతి రాష్ట్రంలో ఇప్పుడున్న నియోజకవర్గాలకు అదనంగా 50 శాతం పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన ఏపీలో అసెంబ్లీ సీట్లు 80 వరకు.. పార్లమెంట్ సీట్లు 13 వరకు పెరుగుతాయి.. అంటే దాదాపు ఓ 100 మంది వరకు అదనంగా అవకాశాలు దక్కుతాయన్నమాట. ఢిల్లీ నుంచి వచ్చిన సమాచారంతోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. జనసేనలో చేరికలకు సంబంధించి 14 మంది నేతలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎంపిక చేసిన నియోజకవర్గాలు, కూటమి నుంచి దక్కించుకునే సీట్లను పరిగణలోకి తీసుకొని కొత్త నేతలను జనసేనలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారన్నమాట. మొన్న ఆ మధ్యన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీఎం చంద్రబాబును కలిశారు. రాజకీయంగా ఆయనతో కీలక చర్చలు జరిపారు. అటు తరువాతే ఈ పరిణామాలన్నీ చోటు చేసుకుంటున్నాయి.
* మహిళా నేతలను..
ప్రధానంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను జనసేనలో చేర్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వంగా గీతా లాంటి మంచి ఇమేజ్ ఉన్న మహిళా నేతలను టార్గెట్ చేసుకున్నట్లు సమాచారం. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళని మహిళా నేతలు వైసీపీలో ఉన్నారు. అటువంటివారు జనసేనలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపిలోకి కొత్త నేతలను తీసుకోవడం కంటే.. జనసేనలోకి పంపించి.. డీలిమిటేషన్ ద్వారా పెరిగే నియోజకవర్గాల్లో ఎక్కువగా జనసేనకు కేటాయించి.. వైసీపీని దెబ్బతీయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నారు. అందుకే టిడిపి చేరికల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జనసేన మాత్రం 14 మంది నేతలతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి చేరికలను ప్రోత్సహించాలని భావిస్తోంది.
* తటస్థులను సైతం
మహిళల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చులకన భావంతో వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వచ్చాయి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఏకంగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని బేస్ చేసుకుని మహిళల పట్ల వైసిపి ప్రవర్తనను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే.. అదే వైసిపి నుంచి మహిళా నేతలను తీసుకొని గట్టి సమాధానం చెప్పాలని కూటమి చూస్తోంది. వీరితో పాటు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, సమాజ హితం కోసం పనిచేస్తున్న వారిని పార్టీలోకి తీసుకోవాలని చూస్తోంది జనసేన. ఈ మొత్తం పరిణామాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నాయి.
