KTR : తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ పరిపాలించారు. రెండు పర్యాయాలు కూడా నాటి ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ కీలక శాఖలను పర్యవేక్షించారు. కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉద్యమం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతున్నారు.
సిరిసిల్ల ప్రాంతంలో కేటీఆర్ కు బలమైన క్యాడర్ ఉంది. ఇక్కడ చేనేత కార్మికులకు ఆయన అనేక విధాలుగా ప్రభుత్వ పథకాలు అందే విధంగా కృషి చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలో లేదు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కేటీఆర్ కొనసాగుతున్నప్పటికీ.. ఫార్ములా ఈ కార్ రేసు లో ఆయన తీవ్రస్థాయిలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆయనను ఏసీబీ విచారించింది.
2023 నుంచి ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అనుకూల ఫలితాలను సాధించలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. పార్లమెంటు ఎన్నికల్లో 0 ఫలితాలను సాధించింది. స్థానిక ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలను కూడా సాధించలేకపోయింది. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది. ఇన్ని ఓటముల సమయంలో భారత రాష్ట్ర సమితికి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కొనసాగారు.
కేటీఆర్ భారత రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడి హోదాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక పర్యాయాలు పర్యటించారు. గతంలో సిరిసిల్ల మీద కేటీఆర్ అంత సీరియస్ గా దృష్టి పెట్టేవారు కాదు. అయితే ఇప్పుడు కేటీఆర్ సిరిసిల్ల మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వారం వారం నియోజకవర్గానికి వెళ్తున్నారు. గతంలో కేటీఆర్ నెలకు ఒకసారి సిరిసిల్లకు వస్తే గొప్పగానే ఉండేది. అయితే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.
గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించానని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు సిరిసిల్లలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక్కసారిగా ఆత్మ రక్షణలో పడిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సిరిసిల్ల నియోజకవర్గం లో భారత రాష్ట్ర సమితి నల్లేరు మీద నడక మాదిరిగా గెలవలేదు. అధికార పక్షానికి పోటీ మాత్రమే ఇవ్వగలిగింది. అయితే ఈ ఫలితాలు కేటీఆర్ ను ఇబ్బందికి గురి చేశాయని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజకవర్గం లో కేటీఆర్ కు అనుకూలంగా అన్ని జరిగిపోయాయి. ఇప్పుడు పరిస్థితి మాత్రం అలా లేదు. కార్యకర్తలు ఇతర పార్టీలవైపు వెళ్ళడానికి ఆసక్తిగా ఉన్నారు. ఈ వలసలను అడ్డుకోవడానికి.. నాయకత్వంలో భరోసా నింపడానికి కేటీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని.. అందువల్లే ప్రజలలో ఉండాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అధికారం ఉన్నప్పుడు కేటీఆర్ అభివృద్ధి పై దృష్టిపెట్టారని.. అప్పట్లో ఆయన నాయకత్వం మధ్య సమన్వయం సాధించడంలో దృష్టి పెట్టలేదని.. అందువల్లే సిరిసిల్లలో గులాబీ పార్టీ నాయకుల మధ్య విభేదాలు పెరిగాయని ప్రచారంలో ఉంది. అందువల్ల కేటీఆర్ ప్రజల్లో ఉంటున్నారు. వారి మధ్య ఉన్న గ్యాప్ ను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. రచ్చబండ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
సిరిసిల్ల అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాత్రమే కాదు. కేటీఆర్ కు బలమైన రాజకీయ కోట. ఆ కోట ఎప్పటికీ బలంగానే ఉండాలి. అలా కాకుండా పగుళ్లు ఏర్పడితే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. భవిష్యత్ కాలంలో కేటీఆర్ నాయకత్వాన్ని ఆ పరిణామం ఇబ్బందికి గురిచేస్తుంది. అందువల్ల ఈ నష్టాన్ని పూడ్చడానికి కేటీఆర్ ఏకంగా నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండ గడుతున్నారు .