Electric Vehicles Benefits: దేశంలో చాలా మంది ఇప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని చూస్తున్నారు. గత కొన్ని నెలల గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కంపెనీలు కూడా ఈ విభాగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్, పెట్రోల్ వాహనాల ప్రయోజనాల గురించి చాలా మంది అయోమయంలో ఉన్నారు. మరీ ముఖ్యంగా, మైలేజ్/రేంజ్ ఈ గందరగోళానికి కారణంగా తెలుస్తోంది. అందుకే ఏది కొనాలో తెలియక చాలామంది తికమకపడుతున్నట్లు తెలిసింది. ఏది ఏమైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగిందనే చెప్పాలి.
పెరుగుతున్న ఇంధన ధరలు, కాలుష్యం కారణంగా.. ప్రభుత్వాలు, ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా ప్రోత్సహిస్తున్నాయి. వీటిపై భారీగా సబ్సిడీలు ఇవ్వడంతో సామాన్యులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని మరోసారి పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. ఈవీలను కొనుగోలు చేసే వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఫేమ్ సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని పొడిగించే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అదే జరిగితే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభిస్తుందని చెప్పవచ్చు.
ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఫేమ్ సబ్సిడీ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం చెల్లుబాటు గడువు ముగిసినప్పటికీ, ఈవీల వినియోగాన్ని పెంచడానికి కేంద్రం ఇప్పటికే ఈ పథకం చెల్లుబాటును అనేక సార్లు పొడిగించింది. ప్రస్తుతం, ఈ పథకం మార్చి 2024 వరకు చెల్లుబాటులో ఉంది. ఫేమ్ సబ్సిడీ పథకం చెల్లుబాటును ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఇది ఇలా ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఎత్తివేయడంతో ఈ రంగానికి సరికొత్త ఊపిరి పోసినట్లు అయింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాదులో విద్యుత్తు వాహనాల కొనుగోళ్లు రెట్టింపయ్యే అవకాశం ఉందని రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామంతో కాలుష్యం కొంతమేర తగ్గనుందని నిపుణులు భావిస్తున్నారు. కొన్నేళ్లుగా ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మరీ ప్రమాదరకర స్థాయిని కూడా దాటేసింది. దీనికి కారణం కాలం చెల్లిపోయిన వాహనాలతోపాటు కొన్ని పరిశ్రమలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్తు వాహనాల సంఖ్య పెంచేందుకు కొంత వరకు ప్రోత్సాహాన్ని అందించింది.
హైదరాబాదులో కాలుష్యంపై ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష చేశారు. తక్షణ చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ లాంటి ఇబ్బందులు తప్పవని గుర్తించారు. ఈ పరిస్థితిని అధిగమించడానికి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు నడిపేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. తాజాగా 2026 డిసెంబర్ వరకు ప్రైవేటు బస్సులు మినహా మిగిలిన అన్ని కేటగిరీల ఈవీ వాహనాలన్నింటికి ట్యాక్స్ లను ఎత్తేశారు. సోమవారం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల కేటగిరిల్లో 1.71 లక్షల ఈవీలను కొనుగోలు చేసినట్లు జేటీసీ రమేష్ మీడియాకు తెలిపారు. గ్రేటర్ హైదరాబాదులో రవాణా రంగం వల్ల నిత్యం 1500 టన్నుల కాలుష్యం వెలువడుతోందని సీపీసీబీ గణాంకాలు వెల్లడించాయి. అంటే ఏటా 10వేల టన్నుల పీఎం 2.5 ఉద్గారాలు వెలువడుతున్నాయి. 2030కల్లా ఇది 30వేల టన్నులకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.