Venu Swamy
Venu Swamy: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో తెలియదు కానీ.. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాజకీయ జాతకాలు చెప్పే వారు ఫేమస్ అవుతున్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఈ కోవలోకి చెందిన వారే. సినీ,రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పి వేణు స్వామి గొప్ప గుర్తింపు సాధించారు. ఏ సినిమా హిట్ అవుతుందో? ప్లాఫ్ అవుతుందో చెప్పగల నేర్పరి ఆయన. అందుకే సినీ ప్రముఖులు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించుకుంటారని తెలుస్తోంది. ప్రభాస్ ఆరోగ్యం గురించి, నాగచైతన్య, సమంత వైవాహిక జీవితం గురించి వేణు స్వామి చెప్పినట్లు జరిగింది. నాగబాబు కుమార్తె నిహారిక వివాహిక జీవితం, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ప్లాప్ గురించి కూడా వేణు స్వామి జోష్యం చెప్పారు. ఆయన చెప్పింది నిజమని తేలడంతో సోషల్ మీడియాలో వేణు స్వామి అంటే ఎనలేని క్రేజ్ పెరిగింది.
ముఖ్యంగా ఆయన చెప్పే రాజకీయ జోష్యం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. 2023లో చంద్రబాబు న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని వేణు స్వామి చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన మాదిరిగానే అవినీతి కేసుల్లో చంద్రబాబు ఇరుక్కున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక ఏపీలో మరోసారి సీఎం గా జగనే అవుతారని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పుడు తాజాగా గణాంకాలతో సహా జోస్యం చెప్పడం విశేషం.
ఏపీలో జగన్ మరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణు స్వామి తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 135 సీట్లు వస్తాయని కూడా తేల్చేశారు. 2029 ఎన్నికల్లో కూడా జగన్ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని వేణు స్వామి జోష్యం చెప్పడం విశేషం. అంతటితో ఆగని ఆయన భవిష్యత్తులో టిడిపి కనుమరుగవుతుందని కూడా చెప్పుకొచ్చారు. సోదరుడు జగన్ ను విడిచిపెట్టి షర్మిల పెద్ద తప్పు చేశారని అన్నారు. అయితే వేణు స్వామిజోష్యాన్ని టిడిపి శ్రేణులు పెద్దగా పట్టించుకోవడం లేదు. అయితే ఇంత మంచి వార్త చెప్పినా వైసీపీ శ్రేణులు సైతం పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తెలంగాణ ఎన్నికల్లో వేణు స్వామి జోష్యం ఫెయిల్ అవ్వడమే అందుకు కారణం. ఆ ఎన్నికల్లో కెసిఆర్ గెలుస్తారని.. సీఎం పదవి చేపట్టి తర్వాత కుమారుడికి అప్పగిస్తారని.. కేంద్ర రాజకీయాల్లో అడుగు పెడతారని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డి జన్మ నక్షత్రం బట్టి ఆయనకు సీఎం అయ్యే ఛాన్స్ లేదని తేల్చేశారు. అయితే వేణు స్వామి జోష్యం ఒకలా ఉంటే.. తెలంగాణ ప్రజల తీర్పు మరోలా ఉంది. దీంతో అప్పట్లో వేణు స్వామి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. అందుకే తెలంగాణలో జోష్యాన్ని గుర్తు చేసుకుని.. ఇక్కడ వైసిపి శ్రేణులు అలాంటి ఫలితమే ఇక్కడ కూడా వస్తుందని భయపడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
View Author's Full InfoWeb Title: Venu swamy said that jagan will once again take oath as cm in ap