US Iran conflict 2026 : ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఆరోపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై యుద్ధం ప్రకటించాడు. కానీ ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌ను కూలదోయడం అమెరికా దీర్ఘకాలిక లక్ష్యం. వివిధ జాతి, మత వర్గాలను రెచ్చగొట్టి, అంతర్గత అస్థిరత సృష్టించాలని వాషింగ్టన్ ఎత్తులు వేసింది. కానీ, ఆ ప్రణాళికలు వికటించి, అమెరికా తాను సృష్టించిన సంక్షోభంలో తానే చిక్కుకుపోయింది. ఇప్పుడు ముందుకు సాగలేక.. వెనక్కి రాకపోలేక నానా తంటాలు పడుతోంది.
కుర్దులను వాడుకోవాలని..
ఇరాన్ జనాభాలో సుమారు 10 శాతం ఉండే కుర్దులు, ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతున్నారు. సిరియాలో ఐఎస్ఐఎస్ను ఎదుర్కొనేందుకు అమెరికా సైన్యమే వీరికి శిక్షణ ఇచ్చింది. ఆ అనుభవంతో కుర్దిష్ పెష్మెర్గా (మృత్యుదళం) ఇరాన్ సరిహద్దులు దాటి భూతల యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంది. తుర్కియే, ఇరాన్ మధ్య నలిగిపోయిన కుర్దులు, ఈ దాడుల్లో పాల్గొంటే తమకు భారీ ప్రతిఫలం దక్కుతుందని ఆశించింది. కుర్దిష్ గ్రూపులు ఇరాన్‌పై పోరాటానికి సిద్ధమయ్యాయి. ఇరాక్‌లో ఉన్న కుర్దిష్ దళాలు ఇరాన్‌లోకి చొరబడేందుకు ఆయుధ విభాగాలను సిద్ధం చేస్తున్నాయి.
బలూచ్‌లను ఎగదోసే వ్యూహం
పాకిస్తాన్‌పై దీర్ఘకాలిక పోరాటం చేస్తున్న బలూచ్‌లను కూడా అమెరికా వాడుకోవాలని చూస్తోంది. గతంలో ’సీపెక్’ ప్రాజెక్టును వ్యతిరేకించి, చైనా ఇంజినీర్లపై దాడులు చేసిన బలూచ్‌లు, అమెరికా మద్దతును ఆశిస్తున్నారు. కానీ, బలూచ్‌లకు హామీ ఇస్తే పాకిస్తాన్‌ను దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఇజ్రాయెల్‌కు మాత్రం ఈ సమస్య లేదు, అయితే భూతల యుద్ధం ప్రారంభమైతే మొత్తం ప్రాంతం గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది.
తప్పుడు అంచనాలు..
ఇరాన్ విషయంలో అమెరికా ప్రాథమికంగా భావించిన దానికి విరుద్ధంగా పరిస్థితులు మారాయి.. సుప్రీంలీడర్ మరణంతో ఇరాన్ విచ్ఛిన్నమవుతుందని, అసంతృప్తితో ఉన్న ప్రజలు వీధుల్లోకి వస్తారని, కుర్దులు, బలూచ్‌లు తిరగబడితే సులభంగా గెలుస్తామని అమెరికా అంచనా వేసింది. కానీ ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. యుద్ధం కారణంగా ప్రజల్లో ఐక్యత పెరిగింది. అంచనాలు తలకిందులు కావడంతో అమెరికా ఇప్పుడు తక్కువ నష్టంతో బయటపడలేని సంకట స్థితిలో ఉంది.
ఇరాన్ ప్రతిఘటన
యుద్ధానికి ముందు ప్రజాదరణ కోల్పోయిన ఇరాన్ ప్రభుత్వం యుద్ధం మొదలైన తర్వాత జాతీయ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ప్రజల మద్దతును సంపాదించుకుంది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) స్థానిక మత కేంద్రాల నుంచి సైనికులను చేర్చుకుంటూ, భూభాగంపై గట్టి పట్టును కొనసాగిస్తోంది. అమెరికా నిఘా నివేదిక కూడా ఇరాన్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదని నిర్ధారించింది.
నాడు అఫ్గాన్‌లోనూ తప్పటడుగే..
అమెరికా ఇరాన్లో చేస్తున్న పొరపాటు, నాడు అఫ్గానిస్తాన్‌లోనూ చేసింది. అఫ్గాన్‌లో హజారాలను శిక్షణ ఇచ్చి తాలిబన్లకు వ్యతిరేకంగా ఉసిగొల్పింది. వాళ్లు 20 ఏళ్లు పరస్పరం దాడులు చేసుకున్నారు. చివరికి అమెరికా వెనుదిరిగి, తాలిబన్లతోనే ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు ఇరాన్లో అమెరికా పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది.
భూతల యుద్ధం ఈజీ కాదు..
అమెరికా, ఇజ్రాయెల్ తమ సొంత సైన్యాలను పంపించాలనుకున్నా, నిపుణులు దీనిని వ్యూహాత్మకంగా తప్పుడు ఎత్తుగడగా భావిస్తున్నారు. ఇరాన్ సంక్లిష్ట పర్వత, ఎడారి భౌగోళిక పరిస్థితులు, స్థానిక జనాభా మద్దతు లేకపోవడం, ఐఆర్జీసీ బలమైన నెట్వర్క్ కలిగి ఉండడం, హార్మూజ్ జలసంధి మూసివేత ముప్పు అమెరికాను భయపెడుతున్నాయి.
మొత్తంగా ఇప్పుడు అమెరికా ముందుకూ కదల్లేక, వెనక్కీ వెళ్లలేని పరిస్థితిలో ఉంది. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తే, ప్రాంతీయ యుద్ధం తప్పదు. వెనుదిరిగితే, అంతర్జాతీయ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఇప్పటికే ఆయిల్ ధరలు పెరిగి, అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇజ్రాయెల్‌తో వ్యూహాత్మక భేదాలు తలెత్తుతున్నాయి. తప్పుడు అంచనాలపై నిర్మించిన వ్యూహం ఇలా కుప్పకూలింది.