Pakistan mediator role : రెండు వారాలపాటు కాల్పుల విరమణ చేపడుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీనిని ఇరాన్ స్వాగతించింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్ ప్రస్తావన తీసుకొచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి, సైన్యాధ్యక్షుడు చేసిన ప్రతిపాదన తనకు నచ్చిందని అందువల్లే కాల్పుల విరమణకు ఒప్పుకుంటున్నట్టు ట్రంప్ శాంతి దూత లాగా ప్రపంచం ముందు బిల్డప్ ఇచ్చారు.
వాస్తవానికి పాకిస్తాన్ ఈ యుద్ధంలో చేసిన పాత్ర పెద్దగా ఏమీ లేదు. ఒకవేళ పాకిస్తాన్ దేశానికి అంత సీన్ గనుక ఉండి ఉంటే యూఏఈ ఇచ్చిన అప్పు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేయదు.. పాకిస్తాన్ కు అంత పరపతి గనుక ఉండి ఉంటే గల్ఫ్ దేశాలు వెంటనే చమురు పంపించేవి. ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు. పైగా పాకిస్తాన్లో పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్థికంగా కోలుకునే అవకాశం లేదు. ధరలు ఘోరంగా పెరుగుతున్నాయి. ఇంధన ధరలు విపరీతంగా ఉండడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు నిల్వలు నిండిపోవడంతో అక్కడి ప్రభుత్వం ఏకంగా లాక్ డౌన్ విధించింది.
పాకిస్తాన్ ముందు ఇప్పుడు గత్యంతరం లేదు. గల్ఫ్ దేశాలు సహాయం చేసే పరిస్థితి లేదు. అంతర్జాతీయ ద్రవ్యనికి సంస్థ నమ్మే అవకాశం లేదు. చైనా కాదు పొమ్మంటున్నది. ఇతర దేశాలు పాకిస్తాన్ నీడను కూడా ఒప్పుకోవడం లేదు. ఎటుచూసినా అమెరికా మాత్రమే కనిపిస్తోంది. అమెరికా ఇచ్చే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే పాకిస్తాన్ తప్పనిసరి పరిస్థితుల్లో బ్రోకర్ పాత్ర పోషించాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్లే ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది.
పాకిస్తాన్ ప్రతిపాదన కంటే ముందు ఇరాన్ పది సూత్రాల ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చింది. దానిని అమెరికా ముందు పెట్టింది. ఇరాన్ ప్రతిపాదన ఒప్పుకుంటే పరువు పోతుందని భావించిన అమెరికా ఏదో మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. ఈ లోగానే పాకిస్తాన్ కు అంతర్గతంగా వర్తమానం పంపిన అమెరికా.. మీడియేటర్ పాత్ర పోషించాలని సూచించింది. అమెరికా సూచనలకు తగ్గట్టుగా పాకిస్తాన్ ప్రధానమంత్రి.. సైన్యాధ్యక్షుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఫలితంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమని సంకేతాలు పంపించాడు.
ప్రస్తుతం పాకిస్తాన్ దేశంలో లాక్ డౌన్ ఉంది. పాకిస్తాన్లో నిల్వలు పూర్తిగా అడుగంటి పోయాయి. గల్ఫ్ దేశాలు చమురు సరఫరాను నిలిపివేశాయి.. దీంతో పాకిస్తాన్ దేశంలో సంక్షోభం ఏర్పడింది.. యూఏఈ అప్పు చెల్లించాలని ఆదేశించడంతో ఫారిన్ నిల్వలనుంచి ఇవ్వాలని పాకిస్తాన్ నిర్ణయించింది. దీంతో ఈ యుద్ధం ఇలాగే సాగితే పాకిస్తాన్ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అందువల్లే ఈ బ్రోకర్ పాత్రను పోషించింది.
మరోవైపు ఇజ్రాయిల్ తో ఉన్న అంతర్గత సంబంధం వల్ల అమెరికా ఈ యుద్ధంలోకి ప్రవేశించింది. ఇజ్రాయిల్ చెప్పుడు మాటల వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోయింది. విమానాలు.. యుద్ధ సామగ్రి సర్వనాశనమైంది. అందువల్లే పాకిస్తాన్ పేరు చెప్పుకొని కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు ట్రంప్ చెప్పినట్లు కనిపిస్తోంది.