TVK VCK alliance : తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. రేపు చెన్నైలో టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి టి వి కే తో పాటు, ఆ పార్టీకి మద్దతిస్తున్న కమ్యూనిస్టులు, వీసీ కే పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరు కాబోతున్నారు. శనివారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత.. మంగళవారం లేదా బుధవారం మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు కేటాయించారు. కమ్యూనిస్టులకు మంత్రి పదవులు కేటాయించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. వి సి కె పార్టీకి కూడా ఒక మంత్రి పదవి దక్కబోతున్నట్టు తెలుస్తోంది.
శుక్రవారం అనేక నాటకీయ పరిణామాల తర్వాత టీవీ కే కు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీ కే పార్టీ నేతలు మద్దతు పలికారు. వారి మద్దతుకు సంబంధించిన లేఖలను టీవీకే అధినేత విజయ్.. గవర్నర్ వద్దకు తీసుకెళ్లి చూపించారు. ఆ మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్.. ప్రభుత్వ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. రేపు ఉదయం చెన్నైలో విజయ్ ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు విజయ్ కి సీఎం కాన్వాయ్ ఏర్పాటు చేశారు. విజయ్ ఇంటి వద్ద భద్రతను పెంచారు.
వీసీకే పార్టీ మద్దతు ఇచ్చినప్పటికీ.. టీవీకే అధినేత విజయ్ కి విధించిన ఓ షరతు తమిళనాడు రాజకీయాలలో కలకలం రేపుతోంది. ఇటీవల ఎన్నికల్లో విజయ్ తిరుచి ఈస్ట్, పెరంబురు నియోజకవర్గాలలో పోటీ చేశారు. తిరుచి ఈస్ట్ స్థానంలో గెలిచినప్పటికీ రాజీనామా చేశారు. పెరంబుర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే ఆస్థానంలో త్రిషను పోటీలో పెట్టి.. ఎమ్మెల్యేగా గెలిపించి.. కేబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరిగింది. దీనికి తోడు గతంలో త్రిష ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా ఎదగాలని ఉందని.. తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేయాలని ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో త్రిషకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది.
మద్దతు ఇస్తూనే వీసీకే నేతలు టీవీకే అధినేత విజయ్ కి ఒక కండిషన్ పెట్టారు. తిరుచి ఈస్ట్ లో విజయ్ రాజీనామా చేసిన నేపథ్యంలో.. అక్కడ తన పార్టీ అధినేత తిరుమావలవన్ పోటీ చేస్తారని పేర్కొంది. ప్రస్తుతం ఆయన చిదంబరం పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే దీనికి టీవీకే అంగీకరించిందా.. లేదా అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. ఇక సిపిఎం, సిపిఐ టీ వీ కేకు మద్దతు ఇచ్చాయి. మంత్రి పదవులు తీసుకోమని.. ప్రభుత్వానికి బయటినుంచి సపోర్ట్ చేస్తామని ప్రకటించాయి.