Trump Iran decision : మంచి యుద్ధం ఉండదు. చెడ్డ శాంతి కూడా ఉండదు. కాకపోతే ఈ విషయం చెబితే ఏ ప్రపంచ అధినేత కూడా ఒప్పుకోడు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. నియంతృత్వం అనేది ప్రతి పాలకుడిలో కనిపిస్తుంది. పైగా తను మాత్రమే ఉండాలి. తన మాట మాత్రమే చెల్లాలి. తను మాత్రమే ఏలాలి అనుకుంటారు. ఈ స్థాయిలో అహం ఉన్న ఏ నాయకుడు కూడా గొప్పగా వర్దిల్లిన దాఖలాలు ఈ ప్రపంచంలో లేవు. హిట్లర్.. సద్దాం హుస్సేన్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.
సాధారణంగా అమెరికా పరిపాలకులు సామ్రాజ్యవాదాన్ని ప్రతి కోణంలోనూ చూపిస్తుంటారు. నచ్చిన దేశంతో వ్యాపారం చేస్తుంటారు. నచ్చని దేశంతో యుద్ధం చేస్తుంటారు. ఆధునిక కాలంలో అమెరికా చేసిన యుద్ధాలు మరే దేశం చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా.. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా బాధిత దేశాల జాబితా చాలా పెద్దది. ఇప్పుడు ఇజ్రాయిల్ మెప్పుకోసం.. అమెరికా ఇరాన్ తో సంబంధం లేని యుద్ధం చేస్తోంది. నెల రోజులకు మించి యుద్ధం చేస్తున్నప్పటికీ ఇరాన్ తలవంచలేదు. దీంతో అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరిగిపోవడం.. సొంత దేశమైన అమెరికాలో కూడా నిరసనలు విపరీతంగా పెరిగిపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ తగ్గిరాక తప్పలేదు. తలవంచక తప్పలేదు.
యుద్ధం వల్ల ఎదురవుతున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బుధవారం భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున కీలక నిర్ణయం తీసుకున్నారు. యుద్ధంలో రెండు వారాలపాటు సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) నిర్ణయం తీసుకున్నారు. మేకపోతు గాంభీర్యం మాదిరిగా ఇరాన్ కు రెండు వారాలు గడువు ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ప్రకటించారు.. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఇటీవల ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దాని ప్రకారం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
” పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ తో మాట్లాడాను. ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ తో కూడా చర్చించాను. వారిద్దరూ దాడులను నిలిపివేయాలని నాతో చెప్పారు.. ఇరాన్ దేశానికి ఇచ్చిన గడువును రెండు వారాలపాటు పొడిగించాలని కోరారు.. హర్ముజ్ జల సంధిని వెంటనే తెరవాలని షరతు కూడా విధించాను. దానికి లోబడి రెండు వారాల గడువు ఇవ్వడానికి.. కాల్పుల విరమణకు ఒప్పుకున్నాను. రెండు దేశాల నుంచి ఈ కాల్పుల విరమణ కొనసాగుతుంది. ఇరాన్ ఇటీవల 10 సూత్రాలతో ఒక ప్రతిపాదనను తీసుకొచ్చింది. అవన్నీ సానుకూలంగా ఉన్నాయి. చర్చలు కూడా చివరి దశకు వచ్చాయి. పశ్చిమ ఆసియా ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి.. ఇరాన్ దేశంతో శాశ్వత శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి.. ఈ రెండు వారాల సమయం ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ఇది ఒక గౌరవంగా ఉంటుందని భావిస్తున్నానని” ట్రంప్ పేర్కొన్నారు.
ట్రంప్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత.. దానికి ఇరాన్ ఓకే చెప్పింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆమెరికాతో చర్చలకు తాము సిద్దమని ఇరాన్ ప్రకటించింది. పరస్పర సోదరభావంతో ఈ యుద్ధం ముగింపునకు కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. సాయుధ దళాల పర్యవేక్షణలో రోడ్డు వారాలపాటు హర్ముజ్ లో రాకపోకలు ఉంటాయని ఇరాన్ వెల్లడించింది. అయితే యుద్ధం శాశ్వతంగా ముగిసినట్టు కాదని.. కేవలం దౌత్యపరమైన చర్చల కోసమేనని ఇరాన్ వెల్లడించింది.