Viral Video : ఆ పెద్దపులి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అడవుల్లో సంచరిస్తోంది. ఆహార అన్వేషణలో భాగంగా ఆ పులి ఇప్పుడు ఖానాపూర్ అడవుల్లోకి వచ్చిందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. అడవుల్లో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాలలో పులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ పెద్దపులి నడవడంతో పాటు గాండ్రింపులు కూడా చేస్తోంది. ఆ వీడియోను అటవీ శాఖ అధికారులు మీడియాకు విడుదల చేశారు.. ఆ వీడియోలో పెద్దపులి అడవిలో సంచరిస్తున్నట్లు కనిపిస్తోంది. భారీ ఆకారం.. స్పష్టమైన చూపు.. గంభీరమైన నడకతో ఆ పులి ఆకట్టుకుంటున్నది.. గుట్టల ప్రాంతాల నుంచి సంచరిస్తూ ఆహార అన్వేషణ కోసం ఆ పులి వెళ్తున్నట్టు తెలుస్తోంది. పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ” ఖానాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోంది. అది గాండ్రింపులు కూడా చేస్తోంది. ఇలాంటి సమయంలో ఎవరూ ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. సాయంత్రం పూట తొందరగా తమ పనులు ముగించుకొని ఇళ్లకు రావాలి. పశువులు, ఇతర జంతువులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉండాలి. సాధ్యమైనంత వరకు గుంపులుగా ఉండడానికి ప్రయత్నించాలని” అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.
పులి ఎందుకు వచ్చినట్టు
సహజంగా ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో పెద్దపులి సంచరించిన ఆనవాళ్లు లేవు. అది కూడా నవంబర్ నెలలో పెద్దపులి కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.” ఈ కాలంలో పెద్దపులి మా ప్రాంతంలోకి ఇటీవల కాలంలో రాలేదు.. కానీ ఈసారి వచ్చింది.. గతంలో అయితే ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు అప్పుడప్పుడు పులులు మాకు కనిపించేవి. అవి కూడా దూర ప్రాంతాలలో సంచరించేవి.. అటవీ సమీప ప్రాంతాలలోకి ప్రవేశించి సాధు జంతువుల మీద దాడులు చేసేవి. కానీ ఈసారి నవంబర్ నెలలోనే పెద్దపులి కనిపించింది. మా అనుమానం ప్రకారం అది ఆహార అన్వేషణ కోసం వచ్చి ఉంటుంది. అందువల్లే మా జంతువులను ఎప్పటికప్పుడు కనిపెట్టుకొని ఉంటున్నాం.. అటవీ శాఖ అధికారుల సూచనల మేరకు గుంపులుగానే సంచరిస్తున్నాం. ఇటీవల నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామంలో మేకల కాపరిపై పులి దాడి చేసింది. రెండు మేకలను చంపి తినేసింది. ఆ అనుభవంతో మేము జాగ్రత్తగా ఉంటున్నామని” నిర్మల్ జిల్లాలోని అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కాగా, ఒకసారి ఆ పెద్దపులి ఆదిలాబాద్ అడవుల్లోకి రావడం అటవీ శాఖ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎండాకాలం ప్రారంభమైన తర్వాత పెద్దపులి కనిపిస్తుందని.. కానీ ఈసారి పెద్దపులి ముందుగానే రావడం విచిత్రంగా ఉందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అడవుల్లో పెద్దపులి సంచారం
భయాందోళనలో ప్రజలు. pic.twitter.com/Dw8DihRG7A
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2024