Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ గ్రాండ్ విక్టరీ కొట్టారు. 300లకుపైగా ఎలక్టోరల్ ఓట్లతో అమెరికా 47 అధ్యక్షుడిగా మరోమారు వైట్‌హౌస్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. 79 ఏళ్ల వయసులో అగ్రరాజ్య అధినేత కాబోతున్నారు. ఈమేరకు అధికార మార్పిడికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు కాబోయే అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎవరెవరికి ఏయే బాధ్యతలు అప్పగించాలని కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ట్రంప్‌కు మరో ఊరట విషయం అందింది. 2020 అధ్యక్ష ఎన్నికల తర్వాత నమోదైన కేసుల నుంచి ఉపశమనం కలుగనుంది. కేసులపై విచారణ ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు. మరోవైపు ట్రంప్ కూడా బైడెన్ సర్కార్ నియమించిన న్యాయవాదిపై చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేసుల విచారణకు ఊరట లభించే అవకాశం ఉంది.
పక్కన పెడుతూ జడ్జి ఆదేశాలు..
వాషింగ్‌టన్ కోర్టులో ప్రస్తుతం ట్రంప్‌పై నడుస్తున్న అనేక క్రిమినల్ కేసుల విచారణ డెడ్‌లైన్లను పక్కన పెడుతున్నట్లు జడ్జి తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల విజ్ఞప్తి మేరకు ఈ ఆదేశాలు ఇచ్చినట్లు జడ్జి తెలిపారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైనందున అతడిని క్రిమినల్ కేసుల్లో ప్రాసిక్యూట్ చేయడం కుదరదని విచారణను వాయిదా వేయాలని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు కోర్టును కోరారు. దీంతో ట్రంప్‌పై కేసుల విచారణ డెడ్‌లైన్లు పక్కన పెడుతున్నట్లు జడ్జి ఆదేశాలు వెల్లడించారు.
ఆ కేసుల్లో దోషిగా..
ఇదిలా ఉంటే.. ట్రంప్ శృంగార తార స్టార్మీ డేనియల్‌కు సంబంధించిన హాష్ మనీ కేసులో ఇప్పటికే దోషిగా తేలారు. ఈ కేసులో తుది తీర్పు నవంబర్ 26న వెల్లడి కానుంది. ట్రంప్ అధ్యక్షుడిగా గెలిచిన నేపథ్యంలో తీర్పు ఎలా ఉంటుంది అనేది ఆసక్తిగా మారింది. తీర్పు వాయిదా వేయాలని ట్రంప్ తరఫు లాయర్లు కోరే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక వాషింగ్‌టన్ డీసీ, ఫోరిడా రాష్ట్రాల్లో నమోదైన రెండు క్రిమినల్ కేసులు కూడా ట్రంప్‌పై ప్రభావం చూసే అవకాశం ఉంది. అందుకే ఆయనపై కేసుల విచారణ వాయిదా వేయాలని ఫెడరల్ నాయ్యయవాదులు కోరినట్లు తెలిసింది.
జనవరి 20న బాధ్యతలు..
ఇదిలా ఉంటే.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇందుకు మరో రెండు నెలల సమయం ఉన్నందున ఈ లోపు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఫెడరల్ న్యాయవాదులే విచారణ వాయిదా వేయాలని కోరడంలో ట్రంప్‌కు న్యాయపరమైన చిక్కుల నుంచి ఉపశమనం లభించినట్లే.