Elon Musk : అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025, జనవరిలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన ట్రంప్ 300పైగా ఎలక్టోరల్ ఓట్లతో గెలిచారు. దీంతో అధికార మార్పు ఖాయమైంది. బైడెన్ నుంచి ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే బాధ్యతల స్వీకరణకు ఇంకా సమయం ఉండడంతో తన పాలనలో కీలకందగా వ్యవహరించే అధికారులతోపాటు, తన కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసే నేతలను ట్రంప్ ఎంపిక చేస్తున్నారు. ఈమేరకు కసరత్తు మొదలు పెట్టారు. ఇక ట్రంప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ ట్రంప్ పాలనలోనూ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఎన్నికల్లో ట్రంప్‌కు ఆర్థికంగా అండగా నిలిచిన మస్క్.. ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా తాజాగా మరో పరిణామం జరిగింది. ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీతో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. వారి సంభాషణలో మస్క్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
క్యాబినెట్ పదవి..
ట్రంప్‌తో జెలñ న్‌స్కీ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న మస్క్ కూడా జెలన్‌స్కీతో మాట్లాడారు. ట్రంప్ కోరిన మీదటే మస్క్.. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చినట్లు కేబినెట్ పదవి ఇస్తారా.. లేక అధ్యక్ష పేషీలో మస్క్‌కు ఇంకా ఏమైనా కీలక పదవి ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. మస్క్ వ్యాపారాల దృష్ట్యా అతనికి విదేవీ వ్యహారాలలో కీలక పదవి దక్కొచ్చని భావిస్తున్నారు. అయితే ఎవరికి ఏ పదవి అనేది ట్రంప్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.