https://oktelugu.com/

Telangana Police : లాఠీ, తుపాకీతో పని లేదు.. ఆంబీస్.. తెలంగాణ పోలీసులకు సరికొత్త ఆయుధం!

మొన్న బెటాలియన్ పోలీసుల ఆందోళన.. నిన్న హోంగార్డుల నిరసన.. ఫలితంగా తెలంగాణ పోలీసులు ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. దీంతో ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నిరసన చేస్తున్న వారిని సస్పెండ్ చేసింది. అనంతరం పోలీసుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 12:25 pm
    Telangana Police

    Telangana Police

    Follow us on

    Telangana Police :  సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రతి పని కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతోంది. మంచి వెనక చెడు ఉన్నట్టు.. సైబర్ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ని రకాలుగా అవగాహన కల్పించినప్పటికీ ఈ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పోలీసులు లాఠీ, తుపాకుల కంటే స్మార్ట్ పరికరాల ద్వారానే ఎక్కువగా పని చేయాల్సి వస్తోంది. దీంతో పోలీసు అధికారుల పనితీరు సమూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను మరింత స్మార్ట్ గా మార్చడానికి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా దేశం నుండి తొలిసారిగా తెలంగాణ పోలీసులకు ఆంబీస్.. (automated multimodel biometric identification system) ను ఉపయోగించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా సుమారు 60 మంది తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో విభాగానికి చెందిన పోలీసులకు రష్యన్ స్పెషల్ ట్రైనర్లతో టి వో టి (ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్) తో శిక్షణ కార్యక్రమం పూర్తి చేసింది. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా అన్ని కమిషనరేట్లు కలిపి ఐదు పోలీస్ స్టేషన్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేసింది. ఆంబీస్ కు సంబంధించిన పనులను కూడా వేగవంతం చేసింది. అవసరమైన సమాచారాన్ని అధునాతన పద్ధతిలో సెర్చింగ్ చేసేలా సాంకేతిక ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది.

    ఎలా పనిచేస్తుందంటే

    ఆంబీస్ ద్వారా నిందితుల వేలిముద్రలు, చేతి ముద్రలను ఐరిష్ కెమెరాల ద్వారా స్కాన్ చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముఖ చిత్రాలను భద్రపరుస్తారు. దానికోసం ఫేషియల్ ఇమేజెస్ విధానాన్ని వాడుతారు. కాలి ముద్రలు, సంతకాలను, సేకరిస్తారు. వీటన్నిటిని బయోమెట్రిక్ విధానంలో భద్రపరుస్తారు. దీనిని ఆంబీస్ సాంకేతికత అంటారు. ఇది మొత్తం ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది.. దీనికోసం న్యూరల్ నెట్వర్క్ ఆధారిత ఫింగర్ప్రింట్ ఆల్గారిథాన్ని ఉపయోగిస్తారు. ఈ సాంకేతికత ఎంతో వేగవంతంగా పనిచేస్తుంది. సమాచార సేకరణలో కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.. ఉదాహరణకు ఒక నేరం జరిగిందనుకున్నాం. సంఘటన స్థలంలో నేరస్థుడు వేలిముద్రలను మాత్రమే పోల్చాలని భావిస్తే.. అవి మాత్రమే పోలే విధంగా ఆంబీస్ ఫలితాన్ని ఇస్తుంది.. ఇక ప్రస్తుతం పోలీసుల డేటా బేస్ లో ఫేషియల్ రికగ్నైజేషన్ అందుబాటులో ఉంది. దానిని నిందితుల ముఖచిత్రాలతో పోల్చే వీలు ఇప్పటికే ఉంది. దీనికి అనుబంధంగా ఆంబీస్ తోడైంది. దీంతో నేరాల దర్యాప్తు చేయడం పోలీసులకు అత్యంత సులభం అవుతుంది. ప్రస్తుతం ఆంబీస్ సాంకేతికతను రష్యా లో మాత్రమే వినియోగిస్తున్నారు.. ఆ తర్వాత ప్రపంచంలో తెలంగాణ పోలీసులే ఈ సాంకేతికతను అందిపుచ్చుకోవడం ఇక్కడ విశేషం.