Vikarabad : దేశానికి అన్నం పెట్టేది రైతు.. రైతులకు వ్యవసాయం తప్ప వేరే పని తెలియదు. నష్టమైనా.. కష్టమైనా వ్యవసాయమే చేస్తాడు. ప్రకృతి ప్రకోపించినా.. ఈ సారి పోయినా మరోసారి కరుణిస్తుందని చూస్తాడు. భూతల్లిని నమ్ముకునేజీవనం సాగిస్తాడు. అయితే ఇలాంటి రైతులు ఆగ్రహిస్తే.. ప్రభుత్వాలే కూలిపోతాయి. గతంలో అనేక సందర్భాల్లో ఇది నిరూపితమైంది. ఇక 2020లో కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా దేశంలో పెద్ద రైతు ఉద్యమమే జరిగింది. పంజాబ్, హర్యానా రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. డిల్లీ ఎర్రకోటపై దాడి చేశారు. రాజధాని సరిహద్దుల్లో నెలల తరబడి నిరసనలు చేశారు. దీంతో రహదారులు మూసివేయాల్సి వచ్చింది. చివరకు కేంద్రం రైతు చట్టాలను ఉప సంహరించుకుంది. తాజాగా ఇప్పుడు తెలంగాణలోని వికారాబాద్ జిల్లా రైతులకు కూడా కోసం వచ్చింది. ఓ ఫార్మా కంపెనీకి అవసరమైన భూసేకరణకు రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన కలెక్టర్, ఇతర అధికారులపై తిరగబడ్డారు. తాము భూములు ఇవ్వమని చెబుతున్నా.. మతకు నచ్చజెప్పేందుకు రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఊరికి ఎందుకు వచ్చారని తరిమి కొట్టారు. కర్రలు, రాళ్లతో అధికారుల వాహనాలపై దాడి చేశారు. ఈఘటన వికారాబాద్ జిల్లా దుద్యాలలో జరిగింది.
ఎందుకంటే..
వికారాబాద్ జిల్లా దుద్యాలలో ఫార్మా సంస్థకు కావాల్సిన స్థలం సేకరించేందకు దుద్యాల మండలం లగచర్ల గ్రామానికి చెందిన రైతులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. ఫార్మా సంస్థ ఏర్పానటును రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో దుద్యాల శివారులో సోమవారం(నవంబర్ 11న) ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కొడంగల్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కడా) ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, అదనపు కలెక్టర్ లింగానాయక్, సబ్ కలెక్టర్ ఉమాశంకర్‌ప్రసాద్ వెళ్లారు. అయితే ప్రజాభిప్రాయ సేకరణ సభకు రైతులు, గ్రామస్తులు రాలేదు. లగచర్లలోనే ఉండిపోయారు. గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి బాధిత రైతుల తరఫున ప్రజాభిప్రాయ సేకరణ వేదిక వద్దకు వెళ్లి కలెక్టర్ జైన్‌తో మాట్లాడారు. రైతులంతా తమ ఊరితో ఉన్నారని, అక్కడే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని కోరారు. దీనికి కలెక్టర్, ఇతర అధికారులు అంగీకరించారు. గ్రామానికి బయల్దేరారు. అధికారులు గ్రామానికి చేరుకోగానే రైతులు ఒక్కసారిగా తిరగబడ్డారు. కర్రలు, రాళ్లతో వాహనాలపై దాడి చేశారు. దీంతో అధికారులు కార్లు దిగి.. పారిపోయారు. పొలాలు, చేల వెంట పరుగులు తీశారు. ఈ దాడుల్లో కలెక్టర్‌తోపాటు పలువురి అధికారుల కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డికి రాళ్లు తగలడంతో గాయపడ్డారు. ఆయన పొలం గట్ల వెంట పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు.
పోలీసులు లేకుండా..
సాధారణంగా ప్రజాభిప్రాయ సేకరణ అంటే.. అధికారులు పోలీస్ బందోబస్తు కూడా తీసుకుంటారు. కానీ, దుద్యాల శివారులో పోలీసులు లేరు. పోలీసులు లేకుండానే సభ ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామస్తుల వద్దకు వెళ్లే సమయంలోనూ ఎలాంటి సెక్యూరిటీ తీసుకెళ్లలేదు. దీంతో ఇదే అదనుగా రైతులు అధికారులపై తిరుగుబాటు చేశారు. విధ్వంసం సృష్టించారు. భూములు ఇవ్వమని చెప్పినా ఎందుకు వస్తున్నారని నినాదాలు చేశారు. తిరిగి వెళ్లకపోవడంతో రైతులే తరిమి కొట్టారు. అయితే పోలీస్ సెక్యూరిటీ ఉంటే.. పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదంటున్నారు.
ఊహించని పరిణామంతో షాక్..
ప్రజాభిప్రాయ సేకరణలో రైతులను ఒప్పించాలని అధికారులు భావించారు. అందుకే పెద్దగా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకోలేదు. రైతులు తమ మాట వింటారని భావించారు. కానీ, గ్రామానికి వెళ్లే క్రమంలో రైతుల నుంచి తిరుగుబాటు ఎదురవుతుందని ఊహిచంలేదు. హఠాత్ పరిణామంతో సాక్ అయ్యారు. ఇదిలా ఉంటే.. కలెక్టర్‌పై ఓ మహిళ దాడి కూడా చేసింది.