Kalvakuntla Kavitha : ఈమధ్య తెలంగాణ రాజకీయాలు ఏపీని మించి పోతున్నాయి. చలికాలంలో పెట్రోల్ మంటలను రాజేస్తున్నాయి. మీడియాకు కావలసిన మసాలాను అందిస్తున్నాయి.. తెలంగాణ రాజకీయాలు ఇంత ఫైర్ గా సాగడానికి ప్రధాన కారణం కేసీఆర్ అయితే.. ఆ ఫైర్ ను మరింత మండించింది కవిత..
ఇటీవల కేసీఆర్ అజ్ఞాతవాసాన్ని వీడి బయటికి వచ్చాడు.. సుదీర్ఘకాలం వ్యవసాయ క్షేత్రానికి పరిమితమైన ఆయన.. ఈసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ను నోటికి ఎత్తుకున్నాడు. రేవంత్ రెడ్డి లేదా ఇష్టానుసారంగా విమర్శలు చేశాడు. అంతేకాదు తోలు తీస్తా అంటూ హెచ్చరించాడు. ఇక రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో రెచ్చిపోయాడు. మొత్తంగా చూస్తే ఇద్దరు నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. అయితే ఇప్పుడు సడన్ గా ఇందులోకి కవిత ఎంట్రీ ఇచ్చింది.
నీటి యుద్ధం చేస్తా, పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తికాదో చూస్తా, చంద్రబాబు ను ఎండగడతా, రేవంత్ రెడ్డి తోలు తీస్తా, అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆమె కుమార్తె సాలిడ్ రిప్లై ఇచ్చింది. పాపం కవిత మాట్లాడుతుంటే, ఉత్తముడు సైలెంట్ అయిపోయాడు. ఈ రెండేళ్ల కాలంలో గులాబీ పార్టీ చేసిన ఏ ఆరోపణ కు ఉత్తం సరైన సమాధానం చెప్పాడని.. కాలేశ్వరం నుంచి మొదలుపెడితే ప్రతి ప్రాజెక్టులో అడ్డగోలు వివారాలు ఉన్నప్పటికీ గులాబీ పార్టీని కార్నర్ చేసే ఏ ఒక్క వ్యవహారాన్ని కూడా ఉత్తముడు చేపట్ట లేకపోయాడు. చివరికి కేసీఆర్ గుడ్డెలుగు అని విమర్శించినా సరే..
పాలమూరు రంగారెడ్డికి ద్రోహం చేసింది కెసిఆర్ అని ఆయన కుమార్తె కవిత ఆరోపిస్తోంది. అసలు జల ద్రోహి మా నాన్న అని తెలంగాణ సమాజానికి మొహమాటం లేకుండా చెబుతోంది. అంతేకాదు, హరీష్ రావు మీద కూడా అపర కాళి మాదిరిగా రెచ్చిపోయింది. ఉమ్మడి పాలమూరు, నాగర్ కర్నూల్ వేదికలుగా కవిత అనేక చీకటి నిజాలను బయటపెట్టింది. వాస్తవానికి కవిత మాట్లాడిన మాటలను కంఠస్థం చేసి రేవంత్ అసెంబ్లీలో వినిపిస్తే చాలు.. కొత్తగా ఉత్తంకుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్యేలకు బుక్లెట్లు పంచాల్సిన అవసరం అంతకంటే లేదు.
బేసిన్లు లేవు. ఎటువంటి భేదాలు కూడా లేవు. నాడు ఫ్యాన్ పార్టీ అధినేతతో స్నేహం వల్ల కెసిఆర్ సైలెంట్ అయిపోయాడు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మీద పడి ఇక్కడ నీటి హక్కులను కాజేసి.. దోచుకుని పోతున్నప్పటికీ కూడా కేసీఆర్ మాట్లాడలేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడితే కనీసం గులాబీ పార్టీ పట్టించుకోలేదు. ఆ పార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కోర్టులలో కేసులు కూడా పెట్టలేదు. తెలంగాణ జాగృతి చొరవతో కొంతమంది రైతులు కేసులు వేశారు. దీంతో తప్పనిసరిగా ఎన్జీటీ ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు పుల్ల వేసింది. గత్యంతరం లేక నాటి గులాబీ పార్టీ ప్రభుత్వం ఇందులో ఇంప్లిడ్ కావాల్సి వచ్చింది. వాస్తవానికి ఈ వ్యవహారంలో కేసీఆర్ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారనేది ఇప్పటికీ అర్థం కాని విషయం.
గతంలో పోతిరెడ్డిపాడుకు 45 వేల క్యూసెక్కుల చొప్పున నీరు వెళ్లేది. ఇప్పుడు అది 90,000 క్యూసెక్కులకు పెరిగిపోయింది. ఇక రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు ద్వారా రోజుకు మూడు టీఎంసీల కృష్ణా జలాలను తరలించే విధంగా ప్రణాళిక రూపొందించినప్పటికీ.. నాటి తెలంగాణ ప్రభుత్వం కనీసం రెస్పాండ్ కాలేదు. అంతేకాదు, 299 టిఎంసిల నీరు మాత్రమే చాలని, నాటి ఒప్పందంపై కేసీఆర్ సంతకం చేయడం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు. కృష్ణా నది మీద ప్రాజెక్టులు పూర్తిగాకపోవడం.. పూర్తి చేయలేకపోవడం కేసీఆర్ అసమర్థత. అందువల్లే కృష్ణా నది వీటిని తెలంగాణ వాడుకోలేకపోయింది.
కాలేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినంత స్పీడ్ గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పరుగులు పెట్టించలేకపోయారు. దీంతో పాలమూరు మరింత వెనుకబడిపోయింది. అక్కడి రైతులకు ఏమాత్రం న్యాయం జరగలేదు. అంతేకాదు, 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కెసిఆర్ హడావిడి ప్రదర్శించాడు. వట్టెం రిజర్వాయర్ కు అనుసంధానంగా ఉన్న పంప్ హౌస్ లో ఒక మోటర్ మాత్రమే ప్రారంభించాడు. వాస్తవానికి ఆ నీటిని సరిగ్గా పంట పొలాలకు పారించే కాల్వల వ్యవస్థను ప్రభుత్వం నిర్మించలేదు. తాము ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించినట్టు గులాబీ లీడర్లు మహా గొప్పగా చెప్పుకున్నారు. కానీ వారు ఇచ్చిన 30 లక్షల ఎకరాల హామీ మాటను మర్చిపోయారు.
డిండి ప్రాజెక్టుకు నీరు ఎక్కడ నుంచి తీసుకోవాలని సోర్స్ విషయమే ఇప్పటివరకు తేలలేదు. గడచిన పది సంవత్సరాలుగా దీని గురించి ఆలోచన చేసిన నాధుడే కరువయ్యాడు. తెలంగాణకు ఇప్పటికి కూడా జూరాల అనేది ఒక లైఫ్ లైన్. దానిని వదిలిపెట్టి పాలమూరు ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వాటర్ వస్తుందని అనుకోవడమే పెద్ద బ్లండర్.. పాలమూరు ప్రాజెక్టులో మొదటి పంప్ హౌస్ ను ఎల్లూరు దగ్గర నిర్మించాలని అనుకున్నారు. దానిని ఓపెన్ పంప్ హౌస్ గా నిర్మించాలని భావించారు. కానీ దానిని అండర్ గ్రౌండ్ గా మార్చేశారు. దీని వెనుక హరీష్ రావు కమీషన్ల కక్కుర్తి ఉందని కవిత ఆరోపిస్తోంది.
హరీష్ రావు చేసిన నిర్వాకం వల్లే కల్వకుర్తి ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం జరగకూడదని ఓపెన్ పంప్ హౌస్ గా డిజైన్ చేస్తే.. చివరికి అండర్ గ్రౌండ్ గా మార్చడం వల్ల.. కల్వకుర్తి లోని థర్డ్, ఫిఫ్త్ పంపులు మొత్తం డ్యామేజ్ అయ్యాయని కవిత ఆరోపిస్తోంది. అందువల్లే కల్వకుర్తిలో మూడు పంప్ హౌస్ లు మాత్రమే పనిచేస్తున్నాయి. రిపేర్లు చేసే అవకాశం కూడా లేకుండా పోయిందని కవిత చెబుతోంది.
మిషన్ భగీరథను లింక్ చేయడం వల్ల ఒక్కరోజు రిపేర్ పనులు జరిగినా వందల గ్రామాలకు తాగునీరు సరఫరా ఆగిపోతుందని కవిత చెప్పుకుంటూ పోయింది. వాస్తవానికి కవిత చేసినవి ఆరోపణలు కావు.. స్పష్టంగా చెప్పాలంటే పచ్చి నిజాలు. దీనికి హరీష్ రావు కౌంటర్ ఇవ్వలేడు. కెసిఆర్ సమాధానం చెప్పలేడు. అసెంబ్లీలో రేవంత్ ఏదో గాయి గాయి చేయాల్సిన అవసరం లేదు. కెసిఆర్ వస్తే కవిత మాటలను సభ ముందు చెబితే సరిపోతుంది. అప్పుడు తెలంగాణ సమాజానికి జల ద్రోహి ఎవరో తెలుస్తుంది.
LIVE: Addressing media in Nagarkurnool#JagruthiJanamBaata https://t.co/7AyJoB0bpt
— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 27, 2025