Revanth Reddy vs NTV Telugu : రాజకీయ నాయకులు కొన్ని సందర్భాలలో తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదమవుతుంటాయి. అలాంటప్పుడు ముందు జాగ్రత్తతో వ్యవహరించాల్సి ఉంటుంది. వేసే అడుగులో అత్యంత పరిశీలనాత్మక దృక్పథాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకో తడబడుతున్నట్టు కనిపిస్తోంది.
ఇటీవల తెలంగాణ మంత్రికి సంబంధించి ఎన్టీవీ ఒక ఆధారం లేని కథనాన్ని ప్రసారం చేసింది. వాస్తవానికి ఈ కథనం ఎన్టీవీ స్థాయికి తగ్గట్టుగా లేదు. ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసే బి గ్రేడ్ స్థాయిలో ఆ కథనం ఉంది. వాస్తవానికి ఇలాంటి కథనాన్ని చూసినవారు ఎవరైనా సరే చర్యలకు ఆదేశాలు జారీ చేస్తారు. దీనికి రేవంత్ రెడ్డి మినహాయింపు కాదు. వాస్తవానికి ఎన్టీవీ ని కార్నర్ చేయాలని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వేగంగానే అడుగులు వేసినప్పటికీ.. అందులో తడబాటు కనిపించింది.
మహిళ ఐఏఎస్ అధికారిపై అలాంటి కథనాన్ని ప్రసారం చేయడం ఎన్టీవీ నేలబారు జర్నలిజానికి నిదర్శనం. ఎన్టీవీ చేసిన తప్పును ప్రజల ముందు ఉంచాల్సిన విషయంలో ప్రభుత్వం కాస్త తడబాటుకు గురి అయింది. అందువల్లే ఎన్టీవీ జర్నలిస్టులకు బెయిల్ లభించింది. వారిని రిమాండ్ కు ఇవ్వాలని.. విచారణ చేపట్టాల్సి ఉందని సిసిఎస్ పోలీసులు కోర్టు ఎదుట విన్నవించారు. అయితే ఎన్టీవీ పాత్రికేయుల తరఫున లాయర్లు గట్టిగా వాదించడంతో.. ప్రభుత్వం తలవంచాల్సి వచ్చింది. ఎన్టీవీ తరఫున లాయర్ల వాదనతో ఏకీభవించిన కోర్టు.. ఆ పాత్రికేయులకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు చేసే క్రమంలో అనేక షరతులు విధించింది. హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళకూడదని.. పాస్ పోర్ట్ లు సరెండర్ చేయాలని.. 20వేల నగదు బాండ్ లు సమర్పించాలని సూచించింది. వాస్తవానికి ఎన్టీవీ కి వ్యతిరేకంగా వాదనలు వినిపించడంలో ప్రభుత్వం తరఫున న్యాయవాదులు విఫలమయ్యారు. కేసు తీవ్రత అర్థమవుతున్నప్పటికీ.. న్యాయమూర్తులకు దానిని అర్థమయ్యేలా వివరించడంలో ప్రభుత్వం తరఫున లాయర్లు విఫలమయ్యారు. తద్వారా ఎన్టీవీ పాత్రికేయులకు బెయిల్ లభించింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం మరోసారి తన వైఫల్యాన్ని ప్రదర్శించింది. ఇదే అదునుగా గులాబీ పార్టీ మీడియా, దాని అనుకూల సోషల్ మీడియా రెచ్చిపోవడం ప్రారంభమైంది. ఇప్పటికే ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టును కేటీఆర్ ఖండించారు. హరీష్ రావు తప్పుపట్టారు. ఏకంగా డీజీపీ కి ఫోన్ చేసి విడుదల చేయాలని కోరారు.
వాస్తవానికి ఒక తప్పును తప్పు అని నిరూపించాలంటే బలమైన సాక్షాలు కావాలి. కోర్టు ఎదుట వాదనలు బలంగా వినిపించాలి. కానీ, వీటిని చేయడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. న్యాయవాదులు విఫలమైతే.. ప్రభుత్వం కూడా విఫలమైనట్టే. ఈ లెక్కన రేవంత్ ప్రభుత్వం కూడా విఫలమైనట్టే. మరి ఎన్టీవీ పై రేవంత్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇంకా ఎలాంటి అడుగులు వేస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.