Asia Cup 2025 : ఆసియా కప్ టోర్నీలో ప్రారంభ మ్యాచ్లో టీ మీడియా అదరగొట్టింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ద్వారా భారత్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. భారత్ గ్రూప్ ఏ లో ఉంది. నెట్ రన్ రేట్ ఏకంగా + 10.483 కి చేరుకుంది. భారత్ తలపడే తదుపరి జట్లు ఏమంత పోటీ ఇచ్చేవి కావు కాబట్టి.. సూర్య సేన ఫైనల్ వెళ్లడం పెద్ద కష్టం కాదు. పైగా జట్టులో ఆటగాళ్లు మొత్తం భీకరమైన ఫామ్ లో ఉన్నారు. తొలి మ్యాచ్లో కులదీప్ యాదవ్, శివం దుబే చెలరేగిన తీరు అద్భుతం. బుమ్రా, హార్దిక్ పాండ్యా వంటి వారు ఆకట్టుకొనిచోట వారిద్దరు దూకుడుగా బౌలింగ్ వేసి వికెట్లు తీసారంటే.. భారత్ ఎన్ని విధాలుగా ఈ సిరీస్ కు సన్నద్ధమైందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి భారత జట్టులో 17మంది అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్లు ఉంటే.. అనివార్య పరిస్థితుల్లో ఇద్దరినీ పక్కన పెట్టాల్సి వచ్చింది. జట్టులో విపరీతమైన పోటీ ఉండడంతో.. సూక్ష్మమైన లెక్కలు వేసుకొని ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి మ్యాచ్లో బ్యాటర్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ(30), గిల్(20*), సూర్య కుమార్ యాదవ్ (7*) సూపర్బ్ ఆటతీరుతో ఆకట్టుకున్నారు. ఫీల్డింగ్లో ప్లేయర్లు అద్భుతమైన ప్రమాణాలను నెలకొల్పారు. ఆడుతోంది పసికూనతో అయినప్పటికీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా టీమిండియా పోరాటపటి మను ప్రదర్శించింది.
ఏ జట్టుకూ సాధ్యం కాలేదు
ఆసియా కప్ లో ఇప్పటివరకు ఏ జట్టుకు సాధ్యం కానీ విధంగా టీమిండియా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నెట్ రన్ రేట్ విషయంలో శ్రీలంక, పాకిస్తాన్ కు సాధ్యం కాని ఘనతను తన పేరు మీద రాసుకుంది. వాస్తవానికి టీమిండియా టాస్ గెలిచిన తర్వాత వెంటనే బ్యాటింగ్ తీసుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ సూర్య కుమార్ యాదవ్ అలా చేయలేదు. బౌలింగ్ కు దిగడం వల్ల ప్రత్యర్థిని తక్కువ స్కోరుకు కట్టడి చేశారు. ఆ తర్వాత ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేదించారు. ఫలితంగా టీమ్ ఇండియా కనివిని ఎరుగనిస్థాయిలో విజయం సాధించింది. తద్వారా ఆసియా కప్ ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఇదే జోరు గనుక టీమ్ ఇండియా కొనసాగిస్తే ఆసియా కప్ లో తిరుగుండదు. వరుసగా రెండోసారి ట్రోఫీని దక్కించుకొని సరికొత్త రికార్డు సృష్టిస్తుంది టీమిండియా. ఆసియా కప్ చరిత్రలో అత్యధిక సార్లు టోర్నీలు సాధించిన జట్టుగా టీమిండియా కొనసాగుతోంది. ప్రస్తుత సిరీస్ కూడా సొంతం చేసుకుంటే టీమిండియా కు ఇక అడ్డు ఉండదు. టీమిండియాను అందుకోవాలంటే మిగతా జట్లకు అంత ఈజీ కాదు.
భీకరమైన ఫామ్ లో
“జట్టులో దాదాపు 18 మంది దాకా అత్యంత ప్రతిభ ఉన్న ప్లేయర్లు ఉన్నారు. వీరిలో 15 మందికి మాత్రమే అవకాశం కల్పించాలంటే సాధ్యమయ్యే పనికాదు. అందువల్లే అనేక రకాలైన సూక్ష్మ లెక్కలు వేసుకొని ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి వచ్చింది. ఎంపిక చేసిన ప్లేయర్లలో ఎవరిని రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేయాలో అర్థం కాని పరిస్థితి. అందువల్లే అవకాశం రాని వాళ్ళు ఇబ్బంది పడకూడదు. విమర్శలు చేయకూడదు. జట్టు ఎంపిక మాక్కూడా ఇబ్బందిగానే ఉంది. కానీ తప్పడం లేదని” ఇటీవల ఆసియా కప్ ప్రారంభం ముందు సెలక్షన్ కమిటీ సారధి అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు అంటే టీమిండియాలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్లేయర్లు భీకరమైన ఫామ్ లో ఉన్నారు. బ్యాటింగ్ పరంగా.. బౌలింగ్ పరంగా.. ఫీల్డింగ్ పరంగా అత్యంత భయంకరంగా కనిపిస్తున్నారు. అందువల్లే టీమిండియా ఆసియా కప్ టోర్నీలో సమర్థవంతమైన జట్టుగా కనిపిస్తోంది. అద్భుతం జరిగితే తప్ప టీమ్ ఇండియా ఈ టోర్నీలో పరాజయం పొందలేదు.
