Union Minister Pemmasani Chandrasekhar : నిజంగా రాజకీయాలు కలుషితమయ్యాయి.ఎవరు ఒప్పుకున్నా,ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. గతంలో రాజకీయాలు అనేవి ప్రజా సేవతో ముడిపడేవి. కేవలం ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చేవారు. కానీ ఇప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకుందామని.. దర్పం, దర్జా వెలగబెడదామని.. నాలుగు తరాల వరకు సంపాదించి పెడదామని రాజకీయాల్లోకి వస్తున్నారు. రాజకీయాలకు అర్థమే మారిపోయింది. ఎన్నికల్లో డబ్బు పంచడం అనేది రివాజుగా మారింది. డబ్బు పంచకపోతే గెలవలేమన్న భావన వ్యక్తం అవుతోంది. అయితే ఈ విశ్లేషణ సామాన్యుడు చేస్తే ఒకలా ఉంటుంది. పెద్దవాడు చేస్తే మరోలా ఉంటుంది. అయితే అందరూ రాజకీయ నాయకులను ఓకే గాటిన కట్టలేం. నిస్వార్ధంగా రాజకీయాల్లో వ్యవహరించిన వారు ఉంటారు. అటువంటి వారు అరుదుగా కనిపిస్తారు. ప్రస్తుత రాజకీయాల్లో భూతద్దం పెట్టినా దొరకరు. అయితే అధికార పార్టీకి చెందిన ఓ కేంద్రమంత్రి రాజకీయాలు దిగజారి పోయాయంటూ వ్యాఖ్యానించడం విశేషం. డబ్బు పంచనిదే ఎన్నికల్లో గెలవలేమని ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
* తొలిసారిగా ఎంపీగా గెలిచి
గుంటూరు ఎంపీగా పోటీ చేశారు పెమ్మసాని చంద్రశేఖర్. తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన చంద్రశేఖర్ కు ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు ఉన్నాయి. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి కేంద్రమంత్రి అయ్యారు. అయితే ఇటీవల ఆయన మాట్లాడిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయని.. డబ్బు పంచనిదే పని జరగదని ఆయన ఆవేదనతో మాట్లాడారు. అయితే దేశంలోనే సంపన్న ఎంపీల్లో చంద్రశేఖర్ ఒకరు. ఎన్నికల్లో ఆయన చాలా ఖర్చుపెట్టినట్లు ప్రచారం సాగింది. పార్టీ కోసం సైతం చాలా ఖర్చుపెట్టినట్లు టాక్ నడుస్తోంది. అందుకే తొలిసారి ఎంపీ అయినా.. కేంద్రమంత్రి కాగలిగారని ఒక ప్రచారం అయితే ఉంది. అటువంటి వ్యక్తి ఎన్నికల్లో డబ్బు పంపకాల గురించి మాట్లాడుతుండడంపై వైసిపి ఎద్దేవా చేస్తోంది. సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి వైరల్ చేస్తోంది.
* సొంత పార్టీ నేతలపై కామెంట్స్
అయితే టిడిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి కేంద్రమంత్రి చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ చెబుతోంది వైసిపి సోషల్ మీడియా. సొంత పార్టీ అవినీతిపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ చెబుతోంది. ప్రస్తుతం చంద్రశేఖర్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. రెండు రోజుల కిందట చంద్రబాబు ఇదే కేంద్రమంత్రికి చురకలు అంటించారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఆరు నెలలు అవుతున్న ఏపీకి నిధులు తీసుకురాకపోవడాన్నిగుర్తు చేశారు చంద్రబాబు. అటు తరువాత ఈ వీడియో సోషల్ మీడియాలో వెలుగు చూడడం విశేషం.
కరెక్ట్ గా చెప్పాడు :
టీడీపీ ఎమ్మెల్యేల అక్రమ సంపాదనపై ఆ పార్టీ ఎంపీ, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడే ఎమ్మెల్యేలు వాళ్ళ రాజకీయ భవిష్యత్తును ఒకసారి చూసుకోవాలని హెచ్చరించారు. pic.twitter.com/o6cG26AZjz— Anitha Reddy (@Anithareddyatp) November 8, 2024