TANA New Jersey CPR Training Program న్యూజెర్సీ: అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే కీలక నైపుణ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన CPR & AED శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కుటుంబాలు, యువత, విద్యార్థులు, స్థానిక కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ శిక్షణను కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్ చీఫ్ అల్ లో-బీర్ నిర్వహించారు. గుండెపోటు వంటి అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన ఎలా ఉండాలి, సీపీఆర్ (Cardiopulmonary Resuscitation) విధానం ఎలా అమలు చేయాలి, AED (Automated External Defibrillator) పరికరాన్ని ఎలా ఉపయోగించాలి వంటి అంశాలను ఆయన సవివరంగా వివరించారు. పాల్గొన్నవారు ప్రత్యక్ష ప్రదర్శనలతో పాటు శిక్షణ మోడళ్లపై ప్రాక్టికల్‌గా అభ్యసించి, అత్యవసర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే నైపుణ్యాలను సొంతం చేసుకున్నారు.

ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం తానా అందించిన LUCAS Chest Compression System గురించి చీఫ్ అల్ లో-బీర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ పరికరం గుండె ఆగిపోయిన రోగులకు నిరంతరాయంగా, నాణ్యమైన ఛెస్ట్ కంప్రెషన్స్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని, గత రెండు సంవత్సరాల్లో అనేక ప్రాణాలను కాపాడటానికి ఇది ఎంతో ఉపయోగపడిందని ఆయన తెలిపారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి అత్యాధునిక పరికరాన్ని అందించిన తానాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

తానా అధ్యక్షులు డా. నరేన్ కొడాలి, కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లావు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో తానా కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ రీజినల్ రిప్రజెంటేటివ్ సుధీర్ చంద్ర నారేపలుపు, కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, యూత్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ చెరుకూరి తదితరులు కీలక పాత్ర పోషించారు.

స్థానిక హైస్కూల్ విద్యార్థిని, EMS వాలంటీర్ వర్షా నారేపలుపు సేవలను తానా నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. యువతలో సేవా భావాన్ని పెంపొందిస్తూ సమాజ సేవలో ముందుండటం ద్వారా ఆమె ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొంది.

ఈ సందర్భంగా తానా కోశాధికారి రాజా కసుకుర్తి మాట్లాడుతూ, తానా కేవలం సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదని, ఆరోగ్యం, విద్య, యువత అభివృద్ధి, రక్తదాన శిబిరాలు, రైతు సహాయ కార్యక్రమాలు, విపత్తు సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. CPR మరియు AED వంటి శిక్షణ కార్యక్రమాలు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడగల సామర్థ్యాన్ని ప్రజల్లో పెంపొందిస్తాయని అన్నారు.
పెద్దలతో పాటు చిన్నారులు కూడా ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం ప్రజారోగ్య అవగాహన, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే సామర్థ్యం, యువతలో సేవా స్పూర్తి మరియు సమాజ సాధికారతను పెంపొందించడంలో తానా చేస్తున్న కృషికి మరో నిదర్శనంగా నిలిచింది. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన చీఫ్ అల్ లో-బీర్, కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్, వాలంటీర్లు మరియు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ తానా నాయకత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
