Sunrisers Hyderabad 300 score : ఐపీఎల్ లో ఒకప్పుడు 200 కొడితేనే గొప్ప అనుకునేవారు. కానీ దానిని సమూలంగా మార్చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. పేరులో ఉన్న రైజింగ్ ను బ్యాటింగ్లో కూడా చూపించింది. అందువల్లే ఏ జట్టుకు సాధ్యం కాని రికార్డులను హైదరాబాద్ అందుకుంది. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో 300 స్కోర్ రికార్డును కూడా హైదరాబాద్ జట్టు నెలకొల్పాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. సొంత మైదానంలో ఆదివారం మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఆటగాళ్లు అంతకుమించి అనే స్థాయిలో బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నారు.
ఐపీఎల్ లో 200 మించిన పరుగులు చేయడమే కష్టం అనుకుంటున్న క్రమంలో.. ఏకంగా 287 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది హైదరాబాద్. 2024 లో ఏప్రిల్ 15న హైదరాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు ఏకంగా మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ఇదే హైయెస్ట్ స్కోర్ గా కొనసాగుతోంది. గత ఏడాది మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ జట్టుతో హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ ప్లేయర్లు ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేశారు. తాము సృష్టించిన రికార్డుకు కేవలం ఒక పరుగుదూరంలో నిలిచిపోయారు. గత ఏడాది మే 25న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్లు 278 పరుగులు చేశారు. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ ఘనతను సాధించారు. 2024లో మార్చి 27న ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేశారు. 2024 ఏప్రిల్ 20న ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ప్లేయర్లు 7 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేశారు.
హైదరాబాద్ ఇన్ని సందర్భాలలో 250+ పరుగులు చేసినప్పుడు.. కీలకంగా ఉన్న ప్లేయర్లు అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్.. ఇప్పుడు వారు హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నారు. భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఈ క్రమంలో సొంతమైదానంపై లక్నో జట్టుతో హైదరాబాద్ ప్లేయర్లు 2026 ఐపీఎల్ సీజన్లో భాగంగా ఆదివారం మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో హైదరాబాద్ 300 స్కోర్ లోడింగ్ అనే నినాదం సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇప్పటికే లక్నో జట్టు ఓటములను ఎదుర్కొంది. మరోవైపు హైదరాబాద్ జట్టు ఒక ఓటమి.. ఒక గెలుపుతో సమతూకం తో ఉంది.
సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్ కావడంతో.. ఇందులో గెలిచి పాయింట్ల పట్టికలో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని హైదరాబాద్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ ఫామ్ లో ఉండడంతో.. హైదరాబాద్ జట్టు ఆ స్థాయిలో స్కోరు చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.