SRH Vs MI: ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కోల్ కతా తో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో వెంట్రుకవాసిలో విజయాన్ని కోల్పోయిన హైదరాబాద్ జట్టు.. మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు సిద్ధమైంది. సొంత మైదానంలో బుధవారం ముంబై జట్టుతో జరిగే మ్యాచ్ లో అమి తుమి తేల్చుకోవడానికి రెడీ అయింది. ఈ టోర్నీలో ముంబై జట్టు కూడా తొలి విజయం కోసం ఎదురుచూస్తోంది. ఆదివారం గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ముంబై అనూహ్యంగా ఓటమిపాలైంది. దీంతో రెండు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం.
తొలి మ్యాచ్ లో గెలుపు అంచుల దాకా వచ్చి హైదరాబాద్ జట్టు ఓటమిపాలైంది.. దీంతో ఎలాగైనా సొంత మైదానంలో విజయం సాధించాలని హైదరాబాద్ జట్టు భావిస్తోంది. హైదరాబాద్ జట్టులో హెన్రిచ్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. అతనితోపాటు అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్ జట్టుకు టచ్ లోకి వచ్చారు. మార్క్ రమ్, సమద్ వంటి వారు ఫామ్ లోకి వస్తే హైదరాబాద్ జట్టుకు ఇక తిరుగు ఉండదు. తొలి మ్యాచ్లో మయాంక్ అగర్వాల్, అభిషేక్ మొదటి వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే జోరును ముంబై జట్టుమీద కొనసాగిస్తే హైదరాబాద్ కు అడ్డుండదు. మిగిలిన బ్యాటర్లు కూడా సత్తా చాటితే జట్టు భారీ స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది.. బౌలింగ్ విభాగంలో నటరాజన్, కమిన్స్ పర్వాలేదనిపిస్తున్నారు. మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, యాన్సెన్ విపరీతంగా పరుగులు ఇవ్వడం జట్టును బాధిస్తోంది.
ముంబై జట్టుకు సంబంధించి భీకరమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. రోహిత్ శర్మ, కిషన్, తిలక్ వర్మ, డేవిడ్, హార్దిక్ పాండ్యా వంటి స్టార్ బ్యాటర్లు ఆ జట్టులో ఉన్నారు. రోహిత్ శర్మ ఉండడం ఆ జట్టుకు ప్రధాన బలం.. అయితే తొలి మ్యాచ్లో బ్రేవిస్, రోహిత్ తప్ప మిగతావారు పెద్దగా రాణించలేదు. బౌలింగ్ లో బుమ్రా, కొయేట్జీ వంటి వారు అందుబాటులో ఉన్నారు. వీరిద్దరూ గుజరాత్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో సత్తా చూపించారు. బుమ్రా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇతడు సూపర్ ఫామ్ లో ఉండడం ముంబై జట్టుకు ప్రధాన బలం. ఇక తొలి మ్యాచ్లో ముంబై జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమయ్యాడు. సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ను చేజేతులా నాశనం చేశాడు. మరి ఈ మ్యాచ్ లో నైనా హార్దిక్ సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాలని ముంబై జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
రెండు జట్ల బలాలు పరిశీలిస్తే హైదరాబాద్ సొంత మైదానంలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 21 మ్యాచ్ లు జరిగాయి. అందులో 9 మ్యాచ్ లలో హైదరాబాద్ గెలిచింది. 12 మ్యాచ్ లలో ముంబై విజయం సాధించింది. సొంత మైదానం, స్థానిక అభిమానులు, కొత్త కెప్టెన్, జట్టును నడిపిస్తున్న తీరు.. ఇవన్నీ హైదరాబాద్ కు సానుకూల అంశాలుగా మారాయి. ఇదే సమయంలో ముంబై జట్టుకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా ప్రధాన అవరోధంగా మారాడు. ఇవన్నీ హైదరాబాద్ జట్టుకు అనుకూలిస్తాయని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
జట్ల అంచనా
హైదరాబాద్
అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, రాహుల్, మార్క్రమ్, క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, నటరాజన్.
ముంబై
ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, బ్రేవిస్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, నమన్ దీర్, పీయూష్ చావ్లా, కొయేట్జీ, బుమ్రా,ల్యూక్ వుడ్.