భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మందాన పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. స్మృతి వివాహం ఆమె ప్రియుడు పలాష్ ముచ్చల్ తో ఆదివారం జరగాల్సి ఉండేది. మహారాష్ట్రలోని సాంగ్లీ వేదికగా ఈ పెళ్లి నిర్వహించాలని ముందే నిర్ణయించుకున్నారు.. దానికి తగ్గట్టుగానే వివాహ వేదికను అందంగా ముస్తాబు చేశారు. మరికొద్ది గంటల్లో వివాహం జరుగుతుందనుకుంటుండగా ఊహించని విధంగా స్మృతి తండ్రి శ్రీనివాస్ కు గుండెపోటు వచ్చింది. దీంతో అకస్మాత్తుగా పెళ్లిని వాయిదా వేశారు.
గుండెపోటు సోకిన శ్రీనివాస్ ను స్థానికంగా ఉన్న ఓ హాస్పిటల్ కు తరలించారు. శ్రీనివాస్ అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాస్ ను ఆ ఆస్పత్రి వైద్యులు అబ్జర్వేషన్ లో పెట్టారు. ఈ సంఘటన మర్చిపోకముందే స్మృతికి కాబోయే భర్తకు వైరల్ ఫీవర్ సోకింది. అంతేకాదు ఆయన జీర్ణ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. దీంతో ఆయనను కూడా మరో ఆసుపత్రిలో చేర్పించారు. అతను కూడా వైద్యుల అబ్జర్వేషన్ లో ఉన్నారు.. ఇవన్నీ ఇలా సాగుతుండగానే స్మృతి మేనేజర్ మీడియాకు ఒక సందేశాన్ని పంపించారు. స్మృతి వివాహాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని.. కుటుంబంలో పరిస్థితి సద్దుమణిగిన తర్వాత తదుపరి వివాహ తేదీని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.
పెళ్లికి ముందు జరిగిన వేడుకలను, ఎంగేజ్మెంట్ వీడియోలను సోషల్ మీడియాలో స్మృతి పంచుకుంది. వీటికి లక్షలాది లైక్స్ వచ్చాయి. ఒకరకంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. అయితే వీటిని స్మృతి డిలీట్ చేయడం సంచలనాన్ని కలిగిస్తోంది. వీడియోలను మాత్రమే కాదు ఫోటోలను కూడా ఆమె పూర్తిగా తొలగించింది. వాస్తవానికి స్మృతి ఇలా చేయడం వెనక ఏదో జరిగి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.. స్మృతికి, ముచ్చల్ కు ఏదైనా గొడవ జరిగి ఉంటుందని.. అందువల్లే వివాహ వేడుకలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని అభిమానులు పేర్కొంటున్నారు. అయితే దీనిపై స్మృతి అధికారికంగా క్లారిటీ ఇస్తే తప్ప అనుమానాలు నివృతి కావని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
“పెళ్లి వేదిక దగ్గరికి అంబులెన్స్ వచ్చింది.. స్మృతి తండ్రి శ్రీనివాస్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.. కొద్ది క్షణాల్లోనే స్మృతి ప్రియుడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు.. ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి.. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత స్మృతి కుటుంబ సభ్యుల మీద ఉంది. ప్రస్తుతం వారు నిశ్శబ్దంగా ఉన్నారు. స్మృతి ఆ వీడియోలను, ఫోటోలను తొలగించింది. ఏదో జరుగుతోంది అనిపిస్తోందని” విశ్లేషకులు పేర్కొంటున్నారు.