Sidda Raghava Rao: ఓ మాజీ మంత్రి వైసిపికి షాక్ ఇవ్వనున్నారా? టిడిపిలో చేరనున్నారా? అసంతృప్తితో పార్టీని వీడుతున్నారా? టిడిపిలో చేరేందుకు ముహూర్తం కూడా నిర్ణయించుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇంతకీ ఆ మాజీ మంత్రి ఎవరంటే ప్రకాశం జిల్లాకు చెందిన శిద్దా రాఘవరావు. ఆయన సీనియర్ మోస్ట్ లీడర్.వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు.2014లో చంద్రబాబు పిలిచి మరి దర్శి టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా రాఘవరావు గెలుపొందారు. దీంతో చంద్రబాబు ఆయనను క్యాబినెట్ లోకి తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయించారు.ఓడిపోవడమే కాకుండా ఎన్నికల అనంతరం వైసిపిలో చేరిపోయారు శిద్దా.
గత నాలుగు సంవత్సరాలుగా వైసీపీలో కొనసాగారు రాఘవరావు. కానీ ఎటువంటి నామినేటెడ్ పదవులు దొరకలేదు. ఒకానొక దశలో టీటీడీ చైర్మన్ పోస్టుకు రాఘవరావు పేరును పరిగణలోకి తీసుకున్నారు. శిద్దా రాఘవరావు సైతం వైసిపి పెద్దలను కలిశారు. తన మనసులో ఉన్న మాటను చెప్పారు. కానీ సీఎం జగన్ మాత్రం తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అప్పటినుంచి తీవ్ర మనస్తాపంతో రాఘవరావు ఉన్నారు. ఇప్పుడు టిక్కెట్ సైతం నిరాకరించడంతో పార్టీని వీడాలని దాదాపు డిసైడ్ అయ్యారు.
దర్శి టిక్కెట్ ను శిద్దా రాఘవరావు ఆశించారు. 2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో నుంచి గెలుపొందడంతో.. సేఫ్ జోన్ అవుతుందని భావించారు. వైసీపీలో చేరిక సమయంలో కూడా ఇదే షరతుతో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ కూడా రాఘవరావుకు కేటాయించలేదు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, టీటీడీ చైర్మన్ పోస్టు ఆశ చూపారు. కానీ ఏ ఒక్క పదవి ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల్లో టికెట్ ప్రకటించలేదు. కనీసం పరిగణలోకి కూడా తీసుకోలేదు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ స్థానానికి టిడిపి అభ్యర్థిగా పోటీ చేశారు రాఘవరావు. కనీసం ఎంపీ సీటుకు కూడా పరిగణలోకి తీసుకోలేదు. చిత్తూరుకు చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి పోటీ చేయించారే తప్ప.. స్థానికుడైన శిద్దా రాఘవరావుకి మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన శిద్దా…పార్టీని వీడడమే ఉత్తమమని భావిస్తున్నారు. ఈనెల 27న చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరనున్నారు.