పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు విదేశీ బోర్డుల తీరుపై భగ్గుమంటున్నారు. రావల్సిండి ఎక్సె ప్రెస్ షోయబ్ అక్తర్ న్యూజిలాండ్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. ఇప్పటికే పలుమార్లు న్యూజిలాండ్ తీరును విమర్శించిన ఈ మాజీ బౌలర్.. ఇంగ్లాండ్ ప్రకటనతో తాజాగా మరోసారి కివీస్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన యూట్యూబ్ చానెల్ వేదికగా అక్తర్ మాట్లాడుతూ ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా మనల్ని తిరస్కరించింది.
మరేం ఫర్వాలేదు గయ్స్.. టీ20 వరల్డ్ కప్ లో కలుసుకుందాం. ముఖ్యంగా న్యూజిలాండ్ ను బాగా గుర్తుపెట్టుకుంటాం. పంజా విసరాల్సిన సమయం వచ్చింది. వాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదు బాబర్ ఆజం అని వ్యాఖ్యానించాడు. తమను ఇంతగా అవమానించిన జట్లపై వరల్డ్ కప్ ఈవెంట్ లో పైచేయి సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కు సూచించారు. టీమిండియాతో మన మ్యాచ్ లు మొదలవుతాయి. ఆ తర్వాత మనం ఆడబోతున్న అతి ముఖ్యమైన గేమ్ న్యూజిలాండ్ తోనే కదా.
అక్టోబరు 26న ఈ మ్యాచ్ జరుగుతుంది. అక్కడే మనం ప్రతాపం చూపించాలి. అయితే, అంతకంటే ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్టు ఆటగాళ్ల ఎంపిక విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది. తుదిజట్టు ఎంత బలంగా ఉంటే మను అంత మంచింది. వరల్డ్ కప్ పై దృష్టి సారించాలి. ఇలాంటి కష్ట సమయంలో గెలుపు మనకు ఎంతో అవసరం అని అక్తర్ అన్నాడు. పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ దేశంలో పర్యటించడానికి అంగీకరించిన న్యూజిలాండ్ చివరి నిమిషంలో టూర్ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.