https://oktelugu.com/

Salman Khan : కృష్ణ జింక లాగానే సల్మాన్ ఖాన్ పరుగులు పెడుతున్నాడు.. దుర్భేద్యమైన భద్రత మధ్య బతుకుతున్నాడు..

అతడు కండల వీరుడు.. బాలీవుడ్ స్టార్ నటుడు.. చేతిలో తుపాకి.. ఎదురుగా కృష్ణ జింక.. అతడి తుపాకీ నుంచి బుల్లెట్ బయటికి వచ్చింది.. ప్రాణ భయంతో పరుగులు పెట్టిన కృష్ణ జింకను నేల కూల్చేలా చేసింది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 9, 2024 / 08:00 PM IST

    Salman Khan

    Follow us on

    Salman Khan : అప్పుడు కృష్ణ జింక పడిన భయం.. తీసిన పరుగునే నేడు సల్మాన్ ఖాన్ కూడా పాటిస్తున్నాడు. ఒకప్పుడు అతడు కృష్ణ జింకను వేటాడిన వేటగాడు.. ఇప్పుడేమో రవి బిష్ణోయ్ చేతిలో బాధితుడు. మన చట్టాలలో లోపాలు.. సల్మాన్ ఖాన్ ను కాపాడుతున్నాయి. ఇలా రాయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఏళ్లకు ఏళ్ళుగా ఈ కేసు నానుతోంది.. మన వ్యవస్థలో డొల్లతనం వల్ల.. అతడికున్న స్టార్ డం వల్ల.. సల్మాన్ ఖాన్ ఇంతవరకు చర్యలకు గురికాలేకపోతున్నాడు.. ఇన్నాళ్ల తర్వాత బిష్ణోయ్ తెగ సల్మాన్ ఖాన్ ను టార్గెట్ చేసింది. తమకు ఇష్టమైన, తమ ఆరాధ్య దైవమైన కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ చంపడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కటకటాల వెనుక ఉన్నప్పటికీ లారెన్స్ బిష్ణోయ్ హెచ్చరికలు పంపిస్తూనే ఉన్నాడు. అతడి తమ్ముడి ద్వారా దమ్కీ లు ఇస్తూనే ఉన్నాడు. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు కానీ.. ఇప్పటికైతే సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు సిద్ధిఖీ హత్యకు గురయ్యాడు. సల్మాన్ ఖాన్ నివాసముండే గెలాక్సీ అపార్ట్మెంట్ వద్ద కాల్పులు కూడా జరిగాయి. ఇన్ని పరిణామాల నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తనను తాను కాపాడుకోవడానికి.. చుట్టూ రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. పటిష్టమైన భద్రత మధ్య బతుకుతున్నాడు.

    షూటింగ్ లోనూ

    సల్మాన్ ఖాన్ ప్రస్తుతం సికిందర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో ఓ హోటల్ ప్యాలెస్ లో సాగుతోంది. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. రెండు పాటలు, కొన్ని సన్నివేశాల కోసం ఈ హోటల్ ప్యాలెస్ నిర్మాతలు బుక్ చేశారు. సల్మాన్ ఖాన్ ను లారెన్స్ గ్యాంగ్ బెదిరించిన నేపథ్యంలో.. ఈ హోటల్ వై సెక్యూరిటీ పరిధిలోకి వెళ్ళింది. సుమారు 70 మంది సాయుధులు నిరంతరం కాపలా కాస్తున్నారు. ఇందులో ఎన్ ఎస్ జీ కమాండోలు కూడా ఉన్నారని మిడ్ డే పత్రిక తన కథనంలో తెలిపింది. ముంబై పోలీసులు, హైదరాబాద్ పోలీసులు కూడా సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీ ఇస్తున్నారు. సల్మాన్ ఖాన్ తన ప్రైవేట్ సెక్యూరిటీగా పార్లమెంటరీ సిబ్బందిని నియమించుకున్నాడు. సల్మాన్ ఖాన్ కు షెరా అనే వ్యక్తి ఎప్పటినుంచో బాడీ గార్డ్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కు అచంచలమైన భద్రత కల్పించేందుకు షెరా సమర్థులైన సెక్యూరిటీ గార్డులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే వై కేటగిరి ఉన్న వ్యక్తులకు ఎన్ ఎస్ జీ కమాండోలు భద్రత కల్పిస్తారా అనేది ఇక్కడ ఒక అనుమానం.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బస చేసిన హోటల్ ఒక దుర్బేధ్యమైన కోటలాగా మారిపోయింది. ఆ హోటల్లోకి వచ్చేవారు సల్మాన్ ఖాన్ సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక పోర్షన్లో మాత్రమే షూటింగ్ చేస్తున్నప్పటికీ.. అక్కడ నిరంతరం సెక్యూరిటీ గార్డులు పహారా కాస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే సల్మాన్ ఖాన్ కండల వీరుడు కావచ్చు. బాలీవుడ్ సినిమా మాఫియాను నడిపిస్తున్న కీలక వ్యక్తి కావచ్చు. అతడికి భారీ నేపథ్యం ఉండవచ్చు.. కానీ అంతిమంగా అతడు భయంతో బతుకుతున్నాడు. ఈ క్షణం ఏం జరుగుతుందో మదన పడుతున్నాడు. తుపాకుల రక్షణ లేకపోతే అడుగు కూడా బయట పెట్టలేకపోతున్నాడు.