US Election Effect : అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారత రూపాయిని షేక్ చేశాయి. వివిధ కారణాలతో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రమంగా పడిపోతోంది. ఈ తగ్గుదల ఎన్నికల ఫలితా ఎఫెక్టా.. లేక సహజంగానే క్షీణించిందా అనేది అంతు చిక్కడం లేదు. డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి విలువ జీవిత కాలం కనిష్టానికి పడిపోయింది. 84.30 రూపాయలుగా నమోదైంది. రూపాయి వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ కరెన్సీలపై డాలర్ ప్రభావానికి ట్రంప్ గెలుపు ఒక కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రూపాయి విలువ పడిపోవడంతో భారత దిగుమతులపై పడుతుంది. ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కరెన్సీని స్థిరీకరించేందుకు రిజర్వు బ్యాంకు జోక్యం చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రతికూల ప్రభావం..
రూపాయి పతనానికి అమెరికా ఎన్నికలు ఒక కారణం అయితే.. దేశీయ మార్కెట్లలోకి విదేశీ సంస్థాగత పెట్టుబడులు తగ్గిపోవడం, మార్కెట్లు స్తబ్ధుగా ఉండడం కూడా రూపాయి విలువపై ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవల అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించింది. దీంతో గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లలో పరిస్థితిలు మారాయి. దీని ప్రభావంతో కూడా రూపాయి ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వడ్డీ రేటు తగ్గింపు..
అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు ఇటీవల ద్రవ విధాన ప్రకటనలో బెంచ్ మార్కు వడ్డీ రేటును 0.25 బేసిక్ పాయింట్లు తగ్గించింది. దీంతో 4.5 శాతానికి పడిపోయింది. ఇప్పుడు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయంపై మార్కెట్ దృష్టి పెట్టింది. ద్రవ్యోల్బణం, ఉపాధిలో సమతుల్య నష్టాలను గుర్తించి యూఎస్ ఫెడ్ తటస్థ నుంచి వడ్డీ రేటును తగ్గించిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయంతో రూపాయి బలపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.