Andhra Jyothi RK : ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ ఆదివారం కూడా తెలంగాణ రాజకీయాలకు మాత్రమే ప్రధాన ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఆదివారం కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చర్చకు దారి తీసిన నైని బొగ్గు గనుల వ్యవహారాన్ని ప్రస్తావించారు. ఇందులో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎన్ టివి చైర్మన్ నరేంద్ర చౌదరికి సంబంధం ఉందని.. సింగరేణి అధికారులను తమ వద్దకు పిలిపించుకొని చర్చలు జరిపించారని.. నేను రాసిన కథనంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చిందని.. దీనిని దారి పట్టించడానికి అనూహ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ ను మళ్లీ కదిలించారని రాధాకృష్ణ ఆరోపించారు.
రాధాకృష్ణ ఏం రాశారు అంటే
నైని కోల్ బ్లాక్ ను హస్తగతం చేసుకోవడానికి భట్టి విక్రమార్క ప్రయత్నించారట. సైట్ విసిట్ అనే విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి.. దానిని అడ్డం పెట్టుకొని నైనీ కోల్ బ్లాక్ ను సొంతం చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయాలు బయటపెట్టినందు వల్లే రాధాకృష్ణ మీద భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో ఎదురుదాడికి దిగారట.. ఇదే విషయాన్ని భట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో ప్రస్తావించారట.
“రాజశేఖర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన విక్రమార్క.. ఇప్పుడు ఆయన పేరు వాడుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి మీద నాకు కక్ష ఉందని లేనిపోని అభియోగాలు మోపుతున్నారు. 16 సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి చనిపోతే.. నాకు ఆయన మీద కోపం ఎందుకు ఉంటుంది.. చిల్లర వార్తలకు భయపడనని భట్టి అన్నారు. చిల్లర వ్యవహారాలు హార్ది దాటినప్పుడు రాతలతో వాతలు పెట్టాలని నాకు జర్నలిజం గురువులు చెప్పారు. అందువల్లే నైని బ్లాక్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చాను. ఇందులో నాకు ఎటువంటి ఉద్దేశాలు లేవు. నాకు ఉద్దేశాలను ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ కథనంతో ఎటువంటి సంబంధం లేదు. ఇద్దరు మహిళ ఐఏఎస్ అధికారుల వ్యక్తిత్వానికించపరిచే విధంగా ఎన్టీవీ కథనం ప్రసారం చేయకపోతే ఈ అంశం నా దృష్టికి వచ్చేది కాదు. ఈ కథనాన్ని లోతుగా పరిశీలిస్తే నాకు అసలు విషయాలు తెలిశాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి ఎటువంటి సవాల్ విసిరినా సరే నా దగ్గర సమాధానం ఉందని” రాధాకృష్ణ తన కొత్త పలుకులో పేర్కొన్నారు.
రాజశేఖర్ రెడ్డి శిష్యుడుగా చెప్పుకుంటున్న ఉప ముఖ్యమంత్రి.. ఆయన బాటలో నడుస్తున్నారు. పంచ కట్టు విషయంలో మాత్రమే కాకుండా అలవాట్ల విషయాలను కూడా ఆయన రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. విక్రమార్క నన్ను విమర్శించిన నాడే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. దీనిని రెండు మీడియా సంస్థల మధ్య గొడవ లాగా ప్రకటించారు. ఎన్టీవీ యాజమాన్యాన్ని.. నన్ను ఒకే గాటిన కట్టే ప్రయత్నం చేశారు. ఇది ఏ మాత్రం నాకు నచ్చలేదు. నేను వెలుగులోకి తెచ్చిన కథనం ప్రకంపనలు సృష్టించిందని” రాధాకృష్ణ రాసుకొచ్చారు.. అంతేకాదు నమస్తే తెలంగాణ పత్రిక విష ప్రచారం చేసిందని, మర గుజ్జు నాయకులతో నాపై విమర్శలు చేయించిందని.. మరోసారి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రి కి గొడవలు పెట్టే విధంగా భారత రాష్ట్రపతి నాయకులు ప్రయత్నించారని రాధాకృష్ణ పేర్కొన్నారు. ఇంకా అనేక విషయాలను ఈ కొత్త పలుకులో ప్రస్తావించారు రాధాకృష్ణ. మరి దీనిపై ముఖ్యమంత్రి ఏం సమాధానం చెబుతారు? భట్టి ఎలా వ్యవహరిస్తారు? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.