Revanth Reddy : అదానీ వ్యవహారం తెరపైకి రావడంతోనే మరుసటి రోజు రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అదాని వ్యవహారంలో పాత్ర ఉన్న ఎవరైనా సరే జైలుకు వెళ్లాల్సిందేనని.. శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను పదేపదే భారత రాష్ట్ర సమితి నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. కేటీఆర్, హరీష్ రావు వంటి వారు ఒక అడుగు ముందుకు వేసి ఆదాని వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కూడా పాత్ర ఉందని విమర్శించడం మొదలుపెట్టారు. అయితే దీనిపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కూడా మాట్లాడింది. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. మీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 కోట్లు ఆదాని దగ్గర విరాళం తీసుకున్నాడు. మరి దాని సంగతేంటి, దావోస్ ప్రాంతంలో 12,000 కోట్లతో పెట్టుబడులు కుదుర్చుకున్నాడు, మరి వాటిపై ఏం మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. దీంతో అటు భారత రాష్ట్ర సమితి, ఇటు భారత జనతా పార్టీ ఒకే తీరుగా విమర్శలు చేయడంతో రేవంత్ రెడ్డి ఎట్టకేలకు మౌనాన్ని వీడారు. అదాని విషయంలో తన స్పందనను తెలియజేశారు. అంతేకాదు కీలక నిర్ణయం తీసుకొని ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టారు.
100 కోట్లు వెనక్కి
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ఆదాని గ్రూప్ 100 కోట్లు విరాళం ఇచ్చింది. ఈ చెక్కును రేవంత్ రెడ్డికి ఇటీవల ఆదాని అందించారు. అయితే దానిని తిరిగి ఇచ్చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ” మా ప్రభుత్వం నిర్మిస్తున్న స్కిల్ యూనివర్సిటీకి అదాని గ్రూపు 100 కోట్లు డొనేషన్ ఇచ్చింది.. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దీంతో ఆ డబ్బును మేము తీసుకోవడం లేదు. దానిని తిరస్కరిస్తున్నాం. ప్రభుత్వాన్ని అనవసరమైన వివాదాల్లోకి లాగండి. 100 కోట్లు ప్రభుత్వ ఖాతాకు బదిలీ చేయవద్దని అదాని గ్రూపు సంస్థలకు లేఖ రాస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం ఆ 100 కోట్లను తీసుకోదు. ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పని చేస్తుంది. ఇందులో ఎన్ని ఆటంకాలు ఎదురైనా వెనక్కి తగ్గదు. ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి.. అలా ఎందుకు చేస్తున్నాయో ఒకసారి అవి ఆత్మ విమర్శ చేసుకోవాలి. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఎలా ఉందో.. ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో ఒకసారి గమనించాలని” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ 100 కోట్లతోనే ఆగిపోతుందా.. లేకుంటే దావోస్ లో కుదుర్చుకున్న పెట్టుబడులను కూడా తెలంగాణ వద్దనుకుంటుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ఆ పెట్టుబడులు కూడా తెలంగాణ వద్దనుకుంటే.. ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు దాదాపు ముకుతాడు పడ్డట్టే.