
కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థ రికవరీకి అడ్డంకులు నెలకొన్న నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం కొన్ని ప్రైవేటు బ్యాంకులు మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈవోలతో వీడియో కాన్పరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఆర్బీఐ ప్రకటించిన కొవిడ్ ఉపశమన చర్యలను సత్వరమే చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా ప్రైవేట్ బ్యాంకుల అధిపతులను కోరారు. మహమ్మారి విసిరిన సవాళ్లతో సతమతమవుతున్న వ్యాపారులు, వ్యక్తులకు ఊతమిచ్చేలా వివిధ ఆర్థిక సేవలను వేగవంతం చేయాలని సూచించారు. భారత బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ బ్యాంకులు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆర్బీఐ గవర్నర్ ప్రశంసించారు.