Mass Jathara Movie Review :నటీనటులు: రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేష్, VTV గణేష్ తదితరులు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
ఛాయాగ్రహణం: విదు అయ్యన్న
దర్శకత్వం: భాను భోగవరపు
నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్
మాస్ జాతర సినిమా పడింది. థియేటర్ గేట్లు.. లోపల డోర్లు మూసేశారు. మూవీ మొదలైంది. సగం చూసేసరికి జనాలు పారిపోతున్నారు. సగం సీట్లు ఖాళీ అవుతున్నాయి. మాస్ మహరాజ్ రవితేజ మూవీ థియేటర్లలో పరిస్థితి ఇదీ..
నిజంగా ఈ మూవీకి జండూభామ్ పట్టుకెళ్లాలి. దొరక్కపోతే శాస్త్రిభామ్ అయినా వాడండి.. అదే రొట్టకొట్టుడు కథ. ప్రేక్షకుడు కుర్చీకి ఫెవికాల్ అంటించుకుంటే తప్ప ఆ రెండు గంటలు భరించడం కష్టం. అంతలా రోటీన్ కథా కథనం.. పాటలు, ఫైట్లు ఎందుకొస్తాయి? ఎప్పుడొస్తాయి. కథ ఎటు పోతుంది. కథనం ఎలా సాగుతుంది.. ఏదీ ఎలా అవుతుందో చెప్పడం కష్టం. ప్రేక్షకుడిని కుర్చీకి తాళ్లతో కట్టేసి చూపించినా ఎవరూ ఈ సినిమా చూడరు. అంత టార్చర్ సామీ..
మాస్ మహారాజా అని ఫ్యాన్స్ ప్రేమగా పిలుచుకునే రవితేజ ఎనర్జీకి కేరాఫ్ అడ్రెస్. సరైన సినిమా పడితే ఎంటర్టైన్మెంట్, థియేటర్లలో సందడి మామూలుగా ఉండదు కానీ ఈ ‘మాస్ జాతర’ కు ముందు రవితేజ నటించిన నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచడంతో అందరి చూపు ఈ కొత్త సినిమాపైన పడింది. తెలుగు చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమవుతున్న రచయిత భాను భోగవరపు ఈ ‘మాస్ జాతర’ తో ప్రేక్షకులను మెప్పించాడా లేదా రవితేజ మాస్ ఫ్రీక్వెన్సీకి వాళ్ళను ట్యూన్ చేయడంలో తడబడ్డాడా అనేది చూద్దాం.
లక్ష్మణ్ భేరి(రవితేజ) వరంగల్ లో రైల్వే పోలీస్ గా ఉద్యోగం చేస్తుంటాడు. ఉద్యోగ రీత్యా తన పరిధి రైల్వే కేసులకు పరిమితమే అయినా ఆంతటితో ఊరుకోడు. ఎక్కడైనా క్రైమ్ జరిగితే దాన్ని ఆపడానికి, క్రిమినల్స్ అంతు చూడడానికి ముందువరసలో ఉంటాడు. ఇలాంటి నిజాయితీ గల పోలీసు ఆఫీసర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని అడవివరం రైల్వే పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ అవుతాడు. అదే ప్రాంతంలో శివుడు(నవీన్ చంద్ర) గంజాయి దంధాలో ఒక బిగ్ షాట్. ‘పుష్ప’ తో ఫేమస్ అయిన శీలావతి అనే సూపర్ క్వాలిటీ గంజాయిని ఇతర రాష్ట్రాలకు, ముఖ్యంగా కలకత్తాకు స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు. పనిలో పనిగా హాబీగా ఇంకొన్ని అరాచకాలు కూడా చేస్తూ విలన్ గా తన ధర్మం పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తూ ఉంటాడు. ఇలా అంతా స్మూత్ గా సాగుతూ ఉన్న అడవివరంలో మన మాస్ హీరో గారు ఒక్క శాతం కూడా శీలమే లేని ఈ శీలావతి స్మగ్లర్ తో ఎందుకు తలపడాల్సి వచ్చింది? ఇలాంటి గంజాయివనాలు ఉండే ఏరియాలోకి క్యూట్ గా ఉండే తులసి (శ్రీలీల) ఎందుకు వచ్చింది? ఇలాంటి వివరాలు తెలియయాలంటే మాత్రం సినిమా చూడకతప్పదని అర్థం చేసుకోగలరు.
కమర్షియల్ సినిమాకు ఒక మీటర్ ఉంటుంది.. ఒక ఫార్మాట్ ఉంటుంది.. ఒక ఇది ఉంటుంది.. ఒక అది ఉంటుంది. అవన్నీ తూ.చా. తప్పకుండా కనీసం సాంగ్స్ ప్లేస్ మెంట్, ఫైట్స్ ప్లేస్మెంట్ లాంటివి కూడా ఏమాత్రం మిస్ కాకుండా చేసిన పక్కా కమర్షియల్ సినిమా ఇది. మీరు ఒక పెన్ను పేపరు లేదా ఫోన్ లో నోట్ ప్యాడ్ తీసుకుని వరసగా రాసుకుంటూ పోతే, హీరో ఇంట్రడక్షన్ కామెడీ సీన్స్.. క్లైమాక్స్ ఫైట్ వరకూ అన్నీటికీ టిక్కులు పెట్టుకోవచ్చు. ఇందులో ఏదైనా మిస్ అయింది అంటే అదొక్క ఐటం సాంగ్ మాత్రమే. సినిమాలో హీరో వరంగల్ కాబట్టి తెలంగాణా మాండలికం మాట్లాడతాడు. కానీ సీన్ ఆంధ్రాకు షిఫ్ట్ అయిన తరవాత అప్పుడప్పుడు అది మరిచిపోయి, మామూలుగా మాట్లాడేస్తాడు. విలన్ పై సెటైర్ గా ఆంధ్రా యాసలో వేసిన ఒకటి అరా డైలాగ్స్ అంటే సరే కానీ చాలా చోట్ల అలా జరిగిపోయింది. ఇదిలా ఉంటే, హీరోయిన్ గా శ్రీలీల, తన తండ్రి సీనియర్ నరేష్ ల ఫ్యామిలీ ట్రాక్ ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో చూసినట్టు కూడా అనిపిస్తుంది. తన డ్యూటీ విషయంలో ఎంతో నిజాయితీతో ఉండే హీరో ఎందుకో కానీ శ్రీలీల – సీనియర్ నరేష్ లు చేసిన ఒక నేరం పట్ల చూసిచూడనట్టు ఉంటాడు. ఇలాంటి చోట్ల హీరో పాత్ర వీక్ గా మారిపోయింది. ఇక రవితేజకు, తన తాతయ్యగా నటించిన రాజేంద్ర ప్రసాద్ కు మధ్య చాలా సీన్లే ఉన్నాయి. క్లైమాక్స్ లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ ఎక్కడా ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు.
నిజానికి ఈ సినిమా కథే వీక్. పైగా బలమైన పాత్రలు లేవు. విలన్ గా శివుడు పాత్ర ఎంతో హై ఇచ్చేరకంగా పరిచయం చేసినా నెమ్మదిగా గ్రాఫ్ డౌన్ అవుతూ వస్తుంది. ఇక హీరో కూడా పేరుకు రైల్వే పోలీసే గానీ ఫైట్స్ లో లెక్కా పక్కా లేకుండా మనుషుల్ని లేపేస్తాడు. సినిమా చూస్తున్నప్పుడు అప్రయత్నంగానే అక్కడక్కడా విక్రమార్కుడు, పుష్ప ఛాయలు కనిపిస్తాయి. కొన్నిచోట్ల దర్శకుడే ప్రయత్నపూర్వకంగా రవితేజ గతంలో నటించిన హిట్ సినిమాల డైలాగ్స్, డ్యాన్స్ స్టెప్పులు గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో ఇంకో మైనస్ సంగీతం. బైట విన్నప్పుడు ఫరవాలేదు అనిపించినా సినిమాలో ప్లేస్ మెంట్ వల్ల, రొటీన్ గా అనిపించే సన్నివేశాల వల్ల తేలిపోయాయి. ఇక నేపథ్య సంగీతం మాత్రం చిరాకు పుట్టించింది. తమన్ ‘అఖండ’ తరహా నేపథ్య సంగీతం లాంటిది ఇవ్వాలని భీమ్స్ ప్రయత్నించాడో ఏమో కానీ ఇక్కడ అది పూర్తిగా వికటించింది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో వోకల్స్(మాస్ జాతర లాంటి పదాల హమ్మింగ్స్) పూర్తిగా మైనస్ అయ్యాయి. సినిమాలో బాగున్నది మాత్రం యాక్షన్ కొరియోగ్రఫీ. శివుడి మామ ఫ్యామిలీతో ఉన్న రెండు ఎపిసోడ్స్ మాత్రం హైలైట్. ఈ సీక్వెన్స్ చూసినప్పుడు క్రాక్ సినిమా గుర్తు వస్తే అది మీ తప్పేమీ కాదు.
హీరోగా రవితేజ ఎనర్జీ ఈ సినిమాలో కూడా డ్యాన్స్ లో, ఫైట్స్ లో ఫుల్లుగా కనిపించింది. యాస విషయంలో మాత్రం తగు జాగ్రత్త అవసరం. హీరోయిన్ శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ విషయంలో ఒకే. ఈ సినిమాలో నటన పరంగా హైలైట్ అయింది మాత్రం శివుడి పాత్రలో నటించిన నవీన్ చంద్ర. తన కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మన్సెస్ అని చెప్పొచ్చు.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. రైటింగ్
2. బ్యాక్ గ్రౌండ్ స్కోర్
3. సాంగ్స్ ప్లేస్ మెంట్
-ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. నవీన్ చంద్ర పెర్ఫామెన్స్
2. యాక్షన్ కొరియోగ్రఫీ
ఫైనల్ వర్డ్: మూస జాతర
రేటింగ్: 2/5
మూస సినిమాలను విపరీతంగా ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఫ్రెష్ హైదరాబాద్ బిర్యానీ లాంటిది కానీ మిగతావారికి మాత్రం రెండు రోజులు డెలివరీ లేట్ అయిన బిర్యాని. “ఈ పాటకు స్కేలు లేదు పెన్ను లేదు పేపర్ లేదు తాళం లేదు తలుపులు లేవు తల తోక లేనే లేదు” అంటూ ఈ సినిమాలో ఒక పాట సాగుతుంది. సినిమా కూడా అంతే. ఈ సినిమా చూసేదీ ప్రేక్షకుల అంతే!
ఇన్నేళ్ల కెరీర్.. చాలా పెద్ద హిట్లు, ఇండస్ట్రీ గురించి సాంతం తెలుసు.. అయినా రవితేజ ఎంపిక చేసుకున్న కథ, సినిమాను చూస్తే నిజంగానే సగటు ప్రేక్షకుడి ఒళ్లు మండుతోంది. పైగా టేస్ట్ ఉన్న నిర్మాత.. ఆయన మాట్లాడితే పెద్ద డైలాగులు చెబుతాడు. అయినా ఏం లాభం.. ఒక సినిమాకు కావాల్సింది మంచి కథ, కథనం.. కొత్తదనం.. అవేవీ లేకుండా ప్రేక్షకులను టార్చర్ పెట్టాలనుకుంటే ఇదిగో ఇలాంటి ఫలితమే వస్తుంది.