నటీనటులు: శ్రీనందు, యామిని భాస్కర్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, నరసింహ S తదితరులు.
సంగీతం: స్మరణ్ సాయి,
ఛాయాగ్రహణం: ప్రకాష్ రెడ్డి
దర్శకత్వం: వరుణ్ రెడ్డి
నిర్మాత: శ్రీనందు, శ్యామ్ సుందర్ రెడ్డి
చాలా ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఇంకా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో శ్రీనందు ఒకరు. రొటీన్ ఫార్మాట్ కమర్షియల్ సినిమా చేస్తే విజయం సాధించడం కష్టమని ఆనిపించిందేమో కానీ ఒక డిఫరెంట్ ప్రెజెంటేషన్ తో బూతుని కలిపికొట్టి కొత్త తరం యూతుని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని సైక్ సిద్ధార్థ టైటిల్, టీజర్లతోనే అర్థం అయింది. న్యూ ఇయర్ డే నాడు ఈ సినిమా మన ముందుకొచ్చింది. ఈ సినిమాతో శ్రీనందు ప్రేక్షకులను మెప్పించగలిగాడా? అసలు సిద్ధార్ధ ముందు సైక్ ఎందుకుంది?.. ఇలాంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
సిద్దార్థ రెడ్డి(శ్రీ నందు) తన ప్రేమికురాలైన త్రిష(ప్రియాంక రెబెకా శ్రీనివాస్) కోసం మన్సూర్ కు చెందిన ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో రెండు కోట్లరూపాయలు పెట్టుబడిగా పెడతాడు. త్రిష నెమ్మదిగా సిద్ధార్థ ను వదిలేసి మన్సూర్ తో సెటిల్ అవుతుంది. రెండు కోట్ల డబ్బు కూడా పూర్తిగా హుష్ కాకీ అవుతుంది. అటు ఫిగరూ పోయి ఇటు కోట్లు పోయీ సిద్ధార్ధ మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఒక సందర్భంలో సైకో లాగా ఒక మురికి గదిలో ఉంటాడు కదా.. అలాగే అర్జున్ రెడ్డికి నిజం కజిన్ లాగా మన సిద్ధార్థ రెడ్డి కూడా అలాగే ఒక బస్తీలో సైకోలాగా నివసించడం మొదలుపెడతాడు. అదే బిల్డింగ్ లో ఇంకో పోర్షన్ లోకి శ్రావ్య(యామిని భాస్కర్) తన పదేళ్ళ కొడుకుతో అద్దెకు చేరుతుంది. తన భర్త నిజం సైకో. వాడి అరాచకాలను భరించలేకే పారిపోయి ఇక్కడికి వచ్చిందన్న మాట. సమాజానికి దూరంగా బతుకుతున్న మన హీరోకు సైకో మొగుడి నుంచి పారిపోయి వచ్చిన ఈ శ్రావ్య పరిచయం అయిన తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి?.. ఇదే మిగతా కథ.
మొదట మనం అర్థం చేసుకవాల్సింది. ఈ సినిమాకు A సర్టిఫికెట్ ఇచ్చారు. రెండోది టైటిల్ లోనే సైక్ ఉంది అంటే సైకో. కాబట్టి కథా కథనాలు సైకో బాటలోనే సాగుతాయనేది మన అండర్ స్టాండింగ్. ఇది తెలియకుండా టికెట్ కొనుక్కుని థియేటర్ లో కూర్చుంటే మీ దూల తీరిపోతుంది. సినిమాలో కథ కంటే స్టైల్ మీద, హీరో క్యారక్టరైజేషన్ మీద రన్ చేశాడు దర్శకుడు. సమాజంలో ప్రస్తుతం జరిగే మోసాలకు బలైన హీరో, సైకో భర్త వల్ల అసలు ఒక మనిషిగా కూడా బ్రతకడాన్ని కూడా మర్చిపోయిన హీరోయిన్. బేసిక్ గా ఇద్దరూ సున్నిత హృదయాలు ఉన్నవారే. వారిద్దరూ దగ్గర కావడమే ఈ సినిమాలో మెయిన్ థీమ్. అయితే ఈ వాక్యంలో చెప్పినంత సులువుగా ఉండదు ప్రెజెంటేషన్. జెన్ జీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఒక సైకో టోన్ లో, ఫాస్ట్ కట్స్ తో, ఫ్లాషీ మ్యూజిక్ తో ప్రెజెంట్ చేశారు. అక్కడక్కడా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, అక్కడక్కడా మీరు అట్టట్ట నవ్వుకోవచ్చు. అంతకు మించి ఈ సినిమా నుంచి ఆశించడానికి ఏమీ లేదు. టార్గెట్ ఆడియన్స్ జెన్ జీ.. కనీసం వారినైనా పూర్తిగా మెప్పిస్తుందా అంటే అది కూడా లేదు మెప్పించదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి కోసమే అన్నట్టు కంప్యూటర్ స్క్రీన్ పై వస్తున్నట్టుగా టెక్స్ట్ లు, గేమ్స్ లో చూస్తున్నట్టుగా సౌండ్స్ తో కొన్ని సీన్స్ ప్రెజెంట్ చేశారు. ఇదంతా ఏదో ఒక కార్టూన్ చూస్తున్న ఫీల్ ఇస్తుంది కానీ ఒక సినిమా చూస్తున్న ఫీల్ ఇవ్వదు.
ఈ సినిమాలో సిద్ధార్థ పాత్రలో శ్రీ నందు చక్కగా నటించాడు. యామిని, ప్రియాంక రెబెకా ఇద్దరూ కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. హీరో ఫ్రెండ్ రేవంత్ పాత్రలో నటించిన సింహా నటన కూడా బాగుంది. కొన్ని చోట్ల అతని పంచ్ లు బాగున్నాయి.
కథ కాకరకాయ లేకుండా.. జస్ట్ స్టైల్ మీద సినిమా రన్ చేసి, ప్రెజెంటేషన్ కూడా అతిగా ఉన్న సినిమా ఇది. ఇది డైరెక్టర్ ఛాయిస్ అయి ఉండొచ్చు. కానీ ఆ అతిగా ఉన్న నరేషనే సినిమా మీద ఇంట్రెస్ట్ ను తగ్గించేసింది. ఈ సినిమాను చూస్తే రెండు సినిమాలు గుర్తు వస్తాయి, ఒకటి అర్జున్ రెడ్డి.. రెండు డీజె టిల్లు. ఈ రెంటిని మిక్సీలో వేసి దానికి అతి నేరేషన్ జోడించి సినిమా చేస్తే అది సైక్ సిద్దార్థ. కానీ ఆ రెండు సినిమాలలో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది, మనసుకు హత్తుకునే సీన్లు ఉంటాయి. టిల్లు చెప్పే పంచులకు నవ్వలేక పొట్ట నొప్పి వస్తుంది. అవేవీ ఈ సిద్ధార్థ లో లేవు. అదే ఈ సినిమా మైనస్. ఏ పాత్ర కూడా బలంగా లేదు. రైటింగ్ వీక్ అనే చెప్పాలి. మ్యూజిక్ కూడా ఆఫ్ బీట్ గా సాగింది. గుర్తుంచుకోదగ్గ పాట ఒక్కటీ లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్నీ ఒక ప్రయోగాత్మక సినిమా తరహాలో సాగాయి.
– సినిమాలో బాగోలేనివి ఇవీ..
1. అతిగా ఉన్న ప్రెజెంటేషన్
2. అసహజంగా ఉన్న కథ
3. అవసరం లేని బూతులు
– ఇందులో ఏం బాగున్నాయో తెలుసా?
1. నందు నటన
రేటింగ్: 1. 5 /5
ఫైనల్ వర్డ్: వీక్ సిద్ధార్థ