AP Politics: ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఎన్నికల ప్రచారంపై దృష్టి పెట్టాయి. వైసిపి ఇప్పటికే నాలుగు సిద్ధం సభలను పూర్తి చేసింది. నాలుగు ప్రాంతాల్లో సభలను ఏర్పాటు చేసి సత్తా చాటింది. దానికి కొనసాగింపుగా 175 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ సైతం సిద్ధం చేసింది. దీనికి మేమంతా సిద్ధం అని పేరు పెట్టింది. ప్రస్తుతం బస్సు యాత్ర సన్నాహాల్లో వైసిపి ఉంది. మరోవైపు మూడు పార్టీలు కూటమి కట్టాయి. ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ లు చిలకలూరిపేటలోని జరిగిన ప్రజా గళం సభలో పాల్గొన్నారు.
రెండోసారి అధికారంలోకి రావాలని జగన్, వైసీపీని అధికారం నుంచి దూరం చేయాలని చంద్రబాబు, పవన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఒకవైపు, విపక్షాలన్నీ కూటమి కట్టడం మరోవైపు అధికార పార్టీని కలవరపరుస్తున్నాయి. 2019 ఎన్నికల ఫలితాలు సాధ్యమేనా అన్న ప్రశ్న వినిపిస్తోంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఓ సర్వే సంస్థ ఫలితాలను ప్రకటించింది. ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఓ సర్వే చేపట్టింది. పోల్ స్కాన్ సర్వే పేరుతో దాదాపు రాష్ట్రంలోని నియోజకవర్గాలన్నింటినీ సర్వే చేపట్టినట్లు తెలిసింది. ఓటర్ల మనోగతాన్ని వెల్లడించింది. 175 నియోజకవర్గాల్లో 2,24,500మంది ఓటర్ల మనోగతాన్ని తెలుసుకుంది. ఇందులో 1,10,000 మందిని సంస్థ ప్రతినిధులు నేరుగా కలుసుకున్నారు. మిగతా వారిని ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం ద్వారా అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాలన,స్థానిక ఎమ్మెల్యే పనితీరు, నియోజకవర్గంలో రాజకీయ స్థితిగతులు, అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేపట్టారు. సర్వే ఫలితాలను వెల్లడించారు. మరోసారి వైసీపీ విజయం ఖాయమని చెప్పుకొచ్చారు. 175 నియోజకవర్గాలకు గాను 120 చోట్ల వైసీపీ విజయం సాధిస్తుందని తేల్చేశారు. జగన్ రెండోసారి అధికారం చేపట్టడం ఖాయమని ఈ సర్వే తేల్చింది. మరోవైపు టిడిపి కూటమికి 44 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పడం విశేషం. వైసిపికి 2019 కంటే ఓటు శాతం పెరుగుతుందని ఈ సర్వే చెప్పుకొచ్చింది.
లోక్సభ స్థానాల్లో సైతం వైసీపీ స్పష్టమైన ఆధిక్యత దిశగా వెళుతుందని ఈ సర్వే తేల్చింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గాను 18 చోట్ల వైసిపి గెలుపు ఖాయమని స్పష్టం చేసింది. కూటమి అభ్యర్థులు రెండు చోట్ల మాత్రమే గెలుపొందుతారని.. మిగతా ఐదు చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని తేల్చి చెప్పింది. మొత్తానికి అయితే జాతీయ సర్వే సంస్థల్లో ఏపీకి సంబంధించి సర్వే ఫలితాలు భిన్నంగా వస్తుండడం విశేషం.