Pawan Kalyan OG movie : అప్పట్లో పూరి జగన్నాథ్ ఓ మాట అన్నాడు. డైలాగ్స్ ఏమీ లేకుండా స్క్రిప్ట్ చెబితే మహేష్ ఒప్పుకుంటాడని.. అదే గన్స్, మాఫియా, కరాటే, సమురాయ్ కథ అంటే పవన్ స్టోరీ వినకుండా ఓకేఅంటాడని.. దర్శకుడు సుజిత్ ఇలాంటి కథనే పవన్ కు చెప్పాడు. ఒప్పించాడు. కానీ రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ తో ఆయన ఇవ్వని డేట్స్ తో సినిమా ఎలా తీయడం.. ఇప్పటికే హరిహర వీరమల్లు లాంటి సినిమా తీయలేక.. పవన్ షూటింగ్ లకు రాక దర్శకుడు క్రిష్ తప్పుకున్నాడు.ఇలాంటి కత్తి మీద సామును సుజిత్ చాకచక్యంగా వ్యవహరించి తీసిన తీరు ఓ అద్భుతమైన టాలీవుడ్ స్ట్రాటజీ అనే చెప్పాలి.
‘హరిహర వీరమల్లు’ ఎప్పుడో కరోనా ముందు మొదలుపెట్టారు. పవన్ డేట్స్ ఇవ్వడం..పూర్తికాకపోవడం.. సమర్థంగా వాడుకోకపోవడం.. ఇలా బాలారిష్టాలకు విసిగి వేసారి దర్శకుడు క్రిష్ ఏకంగా సినిమా నుంచి తప్పుకున్నాడు. కానీ కుర్రదర్శకుడు సుజిత్ మాత్రం అదే బిజీ పవన్ తో ‘ఓజీ’లాంటి మూవీని ఎంతో పకడ్బందీ ప్లాన్ తో తీసి హిట్ కొట్టాడు. నిజానికి ఇలాంటి ఫుల్ బిజీ పవన్ తో ఇలాంటి సినిమా వస్తుందని.. అది హిట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ‘సుజిత్’ నిజంగా ప్రశంసకు అర్హుడే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి స్థాయి రాజకీయ నేతగా బిజీగా ఉన్నారు. ఏపీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ఆయన సినిమాలకు సమయం కేటాయించడం, షూటింగ్‌లకు నిరంతరాయంగా హాజరుకావడం అనేది దాదాపు అసాధ్యంగా మారింది. అయితే, అభిమానులను నిరాశపరచకుండా, తానిచ్చిన అడ్వాన్సులకు న్యాయం చేసేందుకు వీలైనప్పుడల్లా తన పెండింగ్ చిత్రాలను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే, ‘OG (ఓజాస్ గంభీర)’ దర్శకుడు సుజిత్ ఒక మాస్టర్ ప్లాన్‌తో పవన్ కళ్యాణ్‌ను సమర్థంగా వినియోగించుకున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
రాజకీయాల ప్రభావం, దర్శకుడి వ్యూహం
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం, పాలనలో క్రియాశీలకంగా మారడంతో, రాష్ట్రంలో “చీమ చిటుక్కుమన్నా” ఆయన షూటింగ్ ప్యాకప్ చెప్పి హుటాహుటిన వెళ్లాల్సిన పరిస్థితి. సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించడం, పొడవాటి డైలాగులు చెప్పడం, డబ్బింగ్ పూర్తి చేయడానికి రావడం వంటివి ప్రస్తుత బిజీ షెడ్యూల్‌లో దాదాపు అసాధ్యం.
ఈ కఠినమైన వాస్తవాన్ని గుర్తించిన దర్శకుడు సుజిత్ OG కథా కథనంలో వినూత్నమైన మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పవన్ బిజీ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని, ఆయనకు తక్కువ పనిభారం ఉండేలా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దినట్లు సమాచారం.
*తొలి 40 నిమిషాలు పవన్ పాత్ర చిత్రీకరణ
‘OG’ సినిమాలో తొలి 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ తెరపై కనిపించరు. . అంతేకాదు మొదటి 40 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ పాత్రకు డైలాగులే లేవు. ఒకటి, అరా మాటలు తప్ప, ఆయనతో భారీ సంభాషణలు చెప్పించే ప్రయత్నం చేయలేదు.
నిజానికి పవన్ కళ్యాణ్ డైలాగ్స్ చెప్పడంలో టాలీవుడ్ లోనే తిరుగులేదు. ఆయన మేనరిజం యాస భాష డైలాగ్ డెలివరీ అద్భుతం. రాజకీయాల్లోనూ అదే పనిచేసింది. అలాంటి పవర్ ఫుల్ పవన్ తో డైలాగ్స్ లేకుండా సినిమా తీయడం అంటేనే కత్తిమీద సాము. దాన్ని చేసి చూపించాడు సుజిత్. పవన్ డైలాగ్స్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. కానీ ఆయన్ను మౌనం పెట్టి కూడా సినిమా తీయవచ్చు. హిట్ కొట్టవచ్చని నిరూపించాడు సుజిత్.
సినిమాలో పవన్ పెద్దగా మాట్లాడడు.. మరి హీరో బ్యాక్‌గ్రౌండ్, అతని పాత్ర గొప్పదనం ఎలా తెలుస్తుందంటే… అందుకు దర్శకుడు మరో ఉపాయం పన్నారు. సినిమాలోని కీలక పాత్రధారి ప్రకాష్ రాజ్ తో పాటు ఇతర విలన్ పాత్రల ద్వారా కథలో పవన్ పాత్ర యొక్క చరిత్ర, బ్యాక్‌గ్రౌండ్‌ను చెబుతూ కథనాన్ని ముందుకు నడిపించారట.
దీనిని బట్టి చూస్తే, పవన్ కళ్యాణ్ షూటింగ్ కోసం కొంత సమయం దొరికినప్పుడు, కేవలం కొన్ని ఫైట్లు, ఎమోషనల్ సీన్లు మాత్రమే చిత్రీకరించి, ఆ సన్నివేశాల చుట్టూ దర్శకుడు కథను చాలా తెలివిగా అల్లేసినట్లు అర్థమవుతోంది.
పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర తార, ఉప ముఖ్యమంత్రి హోదాలో అత్యంత బిజీగా ఉన్నప్పుడు, ఆ సమయాన్ని సమర్థంగా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకున్న దర్శకుడు సుజిత్ కచ్చితంగా ప్రశంసలకు అర్హుడే అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన చతురత OG సినిమాకు ప్లస్ అయ్యిందనే చెప్పాలి.