https://oktelugu.com/

PAK vs AUS ODI Match : తనదైన రోజు పాకిస్తాన్ ఎలాగైనా ఆడుతుంది.. అంతటి ఆస్ట్రేలియాను సైతం ఓడిస్తుంది.. రెండో వన్డేలో జరిగిందిదే!

కొంతకాలంగా దారుణమైన క్రికెట్ ఆడుతున్న పాకిస్తాన్ గాడిలో పడ్డట్టు కనిపిస్తోంది. ఇటీవల స్వదేశంలో ఇలాంటి జట్టుపై జరిగిన టెస్ట్ సిరీస్ గెలిచిన పాకిస్తాన్.. అదే జోరును ఆస్ట్రేలియాపై కూడా ప్రదర్శిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 / 05:07 PM IST

    PAK vs AUS ODI Match

    Follow us on

    PAK vs AUS ODI Match :  ఆస్ట్రేలియాలో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు పాకిస్తాన్ ఇటీవల కంగారు గడ్డపై అడుగు పెట్టింది. తొలి వన్డేలో ఓడిపోయిన పాకిస్తాన్.. రెండవ వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ 1-1 తేడాతో సమం చేసింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో పాకిస్తాన్ జట్టు అద్భుతమైన ప్రదర్శన చేసింది. మునుపటి పాకిస్తాన్ జట్టును గుర్తు చేసింది.. ఈ విజయం ద్వారా ఏడు సంవత్సరాల అనంతరం ఆస్ట్రేలియా గడ్డపై గెలుపు రుచి చూసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ చేసింది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ 35 ఓవర్లలోనే 163 పరుగులకు ఆల్ అవుట్ అయింది. స్మిత్ (35) టాప్ స్కోరర్ గా నిలిచాడు.. హరీష్ రౌఫ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. షాహిన్ ఆఫ్రిది మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. నసీమ్ షా ఒక వికెట్ అందుకున్నాడు. అయితే టాస్ గెలిచిన పాకిస్తాన్ జట్టు బౌలింగ్ ఎంచుకొని పకడ్బందీగా ఆడింది. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియా విధించిన 164 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ సులువుగా చేదించింది. పటిష్టమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ను పాకిస్తాన్ బ్యాటర్లు సులువుగా ఎదుర్కొన్నారు. కేవలం ఒకే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. 26.3 ఓవర్లలో పాకిస్తాన్ ఆస్ట్రేలియా విధించిన లక్ష్యాన్ని చేదించి తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.. పాకిస్తాన్ జట్టులో ఆయుబ్(82), షఫీకి (64*) సత్తా చాటారు. బాబర్ ఆజామ్ (15*) పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా ఆయూబ్ ఆస్ట్రేలియా బౌలర్ల పై ఎదురుదాడికి దిగాడు. వీరోచితమైన బ్యాటింగ్ చేస్తూ పాకిస్తాన్ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు.

    ఏడు సంవత్సరాల తర్వాత

    పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాపై ఏడు సంవత్సరాల తర్వాత విజయం సాధించింది. కొద్ది సంవత్సరాలుగా పాకిస్తాన్ జట్టు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, స్వదేశంలో టెస్ట్ సిరీస్ లు ఓడిపోతూ పరువు తీసుకుంది. చివరికి బంగ్లాదేశ్ చేతిలోనూ స్వదేశంలో వైట్ వాష్ కు గురైంది. దీంతో పాకిస్తాన్ జట్టు ఆటగాళ్లపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇటీవల కోచ్ కిర్ స్టెన్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. జట్టులో ఆటగాళ్లు సరిగా లేరని.. జట్టు యాజమాన్యం తీరు బాగోలేదని ఆరోపణలు చేస్తూ వెళ్లిపోయాడు. కిర్ స్టెన్ వెళ్లిపోయిన తర్వాత పాకిస్తాన్ జట్టు ఇంగ్లాండ్ జట్టుపై టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించింది. ఆస్ట్రేలియా చేతిలో తొలి వన్డే లో ఓటమిపాలైనప్పటికీ.. రెండవ వన్డేలో విజయం సాధించింది. మొత్తంగా సిరీస్ ను 1-1 ను సమం చేసుకుంది. కాగా, తొలి వన్డేలో రెండు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలిచింది. ఇక మూడవ వన్డే ఆదివారం జరగనుంది. వన్డే సిరీస్ ముగిసిన తర్వాత.. మూడు టి20 సిరీస్ లో ఆస్ట్రేలియా – పాకిస్తాన్ తలపడతాయి.