NTPC Green IPO : ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థ NTPC అనుబంధ సంస్థ అయిన NTPC Green IPO ఈరోజు సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఈ ఐపీవో నుండి మొత్తం 10,000 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ ఐపీవోలో మొత్తం 92,59,25,926 కొత్త షేర్లు జారీ చేయబడతాయి. ఈ ఐపీఓ కింద రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.102-108 ధరను కంపెనీ నిర్ణయించింది. కంపెనీ ఉద్యోగులకు ఒక్కో షేరుపై రూ.5 తగ్గింపు ఇస్తారు. ఇది మెయిన్‌బోర్డ్ ఐపీవో అవుతుంది. ఇది ప్రధాన స్టాక్ మార్కెట్ ఎక్స్ఛేంజీలు బీఎస్సీ, ఎన్ఎస్సీ రెండింటిలోనూ లిస్ట్ చేయబడుతుంది. ఐపీవో కింద QIB కేటగిరీకి 75 శాతం, NII (HNI) కేటగిరీకి 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం రిజర్వ్ చేసింది కంపెనీ.
నవంబర్ 19, మంగళవారం ప్రారంభమైన ఈ ఐపీవో శుక్రవారం నవంబర్ 22న ముగుస్తుంది. నవంబర్ 25న సోమవారం షేర్లను కేటాయించనున్నారు. మరుసటి రోజు అంటే మంగళవారం, నవంబర్ 26 ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలకు షేర్లు జమ చేయబడతాయి. నవంబర్ 27వ తేదీ బుధవారం కంపెనీ స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడుతుంది. ఎన్టీపీసీ గ్రీన్ ఐపీవో కింద, కనీసం ఒక లాట్ కోసం 14,904 రూపాయల పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిదారులకు ఒక లాట్‌లో 138 షేర్లు ఇవ్వబడతాయి. రిటైల్ ఇన్వెస్టర్లు గరిష్టంగా 13 లాట్‌ల (1794 షేర్లు) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, దీని కోసం వారు మొత్తం రూ.1,93,752 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
గ్రే మార్కెట్‌లో షేర్ల జీఎంపీ ధర ఎలా ఉంది?
ఎన్టీపీసీ గ్రీన్ షేర్లకు సంబంధించి గ్రే మార్కెట్‌లో చెప్పుకోదగ్గ కదలిక లేదు. నవంబర్ 18, సోమవారం రాత్రి 08:00 గంటలకు, ఎన్టీపీసీ గ్రీన్ షేర్లు జీఎంపీ ధర రూ. 0.70తో గ్రే మార్కెట్‌లో ట్రేడవుతున్నాయి. షేర్ల జీఎంపీ ధరను ట్రాక్ చేసే వెబ్‌సైట్ ప్రకారం.. నవంబర్ 9న కంపెనీ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 25 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి. అయితే, ఐపీవో ప్రారంభమైన తర్వాత సబ్‌స్క్రిప్షన్ పెరగడంతో, గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్ల జీఎంపీ ధర కూడా పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.