Nikita Godishala : అగ్రరాజ్యం అమెరికాలో గొడిశాల నిఖిత అనే తెలుగుమ్మాయి దారుణమైన హత్యకు గురైంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత అనేక విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కేసు కు సంబంధించి దిగ్బ్రాంతి కరమైన వాస్తవం వెలుగులోకి వచ్చింది.
నిఖిత హత్యకు ప్రేమ వ్యవహారం కారణమై ఉంటున్నది అందరూ అనుకున్నారు. అన్ని మీడియా సంస్థలులో కూడా అదే తీరుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె అలా హత్యకు గురికావడానికి ప్రధాన కారణం ప్రేమ వ్యవహారం కాదని, ఆర్థికపరమైన విషయాలని తేలింది.
నిఖిత ఉన్నత చదువుల నిమిత్తం కొంతకాలం క్రితం అమెరికాకు వెళ్లిపోయింది. ఆమె అక్కడే ఉండి చదువుకుంటున్నది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన అర్జున్ శర్మ కూడా అమెరికాలో ఉంటున్నాడు. అర్జున్ శర్మ, నిఖిత స్నేహితులు. కొంతకాలంగా అర్జున్ శర్మ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో అర్జున్ శర్మకు నిఖిత నాలుగున్నర వేల డాలర్లు అప్పుగా ఇచ్చింది. డబ్బులు తీసుకున్న అర్జున్ శర్మ.. ఇవ్వడం మాత్రం మర్చిపోయాడు. తాను ఇచ్చిన డబ్బులను నిఖిత అడుగుతుంటే అతడు ఏమాత్రం స్పందించడం లేదు. ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు.
తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ నిఖిత అర్జున్ మీద ఒత్తిడి తేవడం మొదలు మొదలుపెట్టింది. దీంతో అర్జున్ మూడున్నర వేల డాలర్లు తిరిగిచ్చాడు. మిగతా వెయ్యి డాలర్ల కోసం నిఖిత ఒత్తిడి తేవడం మొదలుపెట్టింది. దీంతో అగ్రహానికి గురైన అర్జున్.. ఆమె ద్వారా మూడున్నర వేల డాలర్లను తన ఖాతాలకు బదిలీ చేయించుకున్నాడు. అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత ఇండియాకు తిరిగివచ్చాడు. నిఖిత హత్యకు సంబంధించి ఇంటర్ పోల్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు తమిళనాడు వచ్చారు. అర్జున్ శర్మను అరెస్ట్ చేశారు. కేసు నమోదుచేసి, దర్యాప్తు ప్రారంభించారు.
నిఖిత హత్యకు గురికావడంతో ఆమె తండ్రి ఆనంద్ కన్నీటి పర్యంతమవుతున్నాడు. ” చాలా ఏళ్ల క్రితం మా అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ చదువుకుంటున్నది. గతంలో అతడు మా అమ్మాయి రూమ్ మేట్ గా ఉన్నాడు. చాలాసార్లు మా అమ్మాయిని డబ్బులు అడిగాడు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరితే హత్య చేశాడు.. నిఖితను హత్య చేసి.. తనకు ఏమీ తెలియనట్టుగా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత అమెరికా నుంచి పారిపోయి వచ్చాడు. మేరీ ల్యాండ్ ప్రాంతంలో డేటా అనలిస్టుగా నా కుమార్తె పని చేస్తోంది. నా కూతురికి జరిగిన అన్యాయం ఎవరికీ జరగొద్దు. నా కుమార్తె మృతదేహాన్ని త్వరితగతిన ఇండియాకు తీసుకొచ్చే ఏర్పాట్లను అధికారులు చేయాలని కోరుతున్నానని” నిఖిత తండ్రి ఆనంద్ పేర్కొన్నాడు.