https://oktelugu.com/

Mancharyala : పాపం, పుణ్యం కాస్త పక్కన పెడితే.. ఆ పనికి ఒడిగట్టిన ఆ సిబ్బందిని ఏం చేసినా తప్పులేదు..

ఉదయం ఆంధ్రజ్యోతి పేపర్ తిరగేస్తుంటే లోపలి పేజీలో కనిపించిన వార్త ఇది.. చూడగానే మనసు చివుక్కుమనిపించింది. అందులో కుక్కల ఫోటో వేయలేదు గాని.. వేస్తే ఇంకా దారుణంగా ఉండేది..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 8, 2024 / 09:44 AM IST

    Mancharyala

    Follow us on

    Mancharyala :  అది మంచిర్యాల జిల్లా కేంద్రం.. అక్కడ మున్సిపల్ సిబ్బంది వీధులను తిరిగి కుక్కలను తీసుకొచ్చి జంతు సంరక్షణ కేంద్రంలో వేశారు. అలా వేసినవారు వాటికి తాగునీరు, తిండి వేయడం మర్చిపోయారు.. దీంతో ఆ కుక్కలు ఆకలితో అలమటించిపోయాయి. ఇప్పటికే చాలావరకు కుక్కలు చనిపోయాయి. ఇంకా 12 వీధి కుక్కలు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. దొరికిందేదో తిని.. వీధుల వెంట తిరిగే ఆ కుక్కలు.. మునిసిపల్ సిబ్బంది కంటపడి తమకు తామే మరణ శాసనం రాసుకున్నాయి. వీధి కుక్కలకు కుటుంబానియంత్రణ ఆపరేషన్ల పేరుతో మున్సిపల్ సిబ్బంది ఆ శునకాలను తమ వెంట తీసుకెళ్లారు. ఆ తర్వాత వాటిని పశు సంరక్షణ కేంద్రంలో పడేశారు. ఆ తర్వాత వాటిని మర్చిపోయారు. దీంతో ఆ కుక్కలు ఆకలితో అలమటించి చనిపోయాయి. అయితే ఆ పశు సంరక్షణ కేంద్రంలో దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గుర్తించి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

    ప్రత్యేక ఆస్పత్రి..

    వీధి కుక్కల బెడద తగ్గించడానికి మంచిర్యాలలో అప్పట్లో ఒక ఆసుపత్రి నిర్మించారు. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో ఒక ఆపరేషన్ థియేటర్.. ఆపరేషన్ చేసిన తర్వాత కుక్కలను పరిశీలనలో ఉంచడానికి మరొక గది నిర్మించారు.. మంచిర్యాల మున్సిపాలిటీ పై బాధ్యతను నిర్వర్తించేందుకు టెండర్లు పిలవగా హైదరాబాద్ చెందిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ ఆ నిర్వహణ బాధ్యతను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఒక వెటర్నరీ వైద్యుడిని, ఇద్దరు సహాయకులను, ఒక వాచ్ మన్, హెల్పర్ ను నియమించింది. టార్గెట్ ప్రకారం ప్రతిరోజు 15 కుక్కలకు ఆపరేషన్లు ఇక్కడ చేస్తుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం దాదాపు 20 కుక్కలను ఈ ఆసుపత్రికి తీసుకువచ్చారు..

    అందరిని తొలగించారు

    యానిమల్ వెల్ఫేర్ సొసైటీ నియమించుకున్న ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వకపోవడంతో.. వారు ఆందోళన చేశారు. దీంతో వారందరినీ ఆ సంస్థ ఉద్యోగాల నుంచి తొలగించింది. కేవలం వెటర్నరీ డాక్టర్ ను మాత్రమే ఉంచుకుంది.. అప్పట్నుంచి ఈ ఆసుపత్రికి ఎవరూ రావడం లేదు. వారెవరు అటువైపు రాకపోవడంతో అందులో ఉన్న కుక్కలకు మరణ శాసనంగా మారింది. ఆహారం, నీరు లేకపోవడంతో ఎనిమిది కుక్కలు వారం క్రితం చనిపోయాయి. అయితే వాటి కళేబరాలు కూడా తొలగించేవారు లే కపోవడంతో ఆ ప్రాంతం మొత్తం దారుణమైన వాసన వస్తోంది. స్థానికులు ఆందోళన చెంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే దీనిపై ఆ ఆస్పత్రి వైద్యుడిని వివరణ కోరగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.. ఈ వ్యవహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..” కుక్కలను తీసుకొచ్చి ఇక్కడ వేశారు. వాటికి తాగునీరు, ఆహారం అందించడం మర్చిపోయారు. వారికి కూడా అలాంటి శిక్ష విధించాలి. అప్పుడే మూగజీవాల బాధ అర్థం అవుతుందని” స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.