Mulugu Jungle Safari : నేటి కాలంలో మనుషుల జీవితాలు అత్యంత ఒత్తిడి లో కూరుకుపోతున్నాయి. చదువు.. కెరియర్.. ఉద్యోగం.. ఇంకా రకరకాల వాటి చుట్టూ తిరగడం వల్ల మనుషులకు సంతోషం అనేది లేకుండా పోతుంది. ఒత్తిడి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు శరీరం మీద దాడి చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనుషులకు కాస్త ప్రశాంత వాతావరణం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత వాతావరణం అనేది ఒకరకంగా కష్టమే. భూముల విలువ పెరిగిపోతోంది. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్స్ మాదిరిగా నగరాలు.. పట్టణాలు మారిపోతున్నాయి. రిలాక్స్ కోసం వెళ్లాలంటే దూరప్రాంతాలకు ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అటువంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పించింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలను సందర్శించడానికి ప్రజలు ప్రతి ఏడాది భారీగా వెళ్తుంటారు. ఫలితంగా ప్రభుత్వం భారీగా పర్యాటక ఆదాయాన్ని కోల్పోతోంది. ముఖ్యంగా అడవులను.. ఇతర ప్రాంతాలను సందర్శించేవారు భారీగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అడవుల్లో రకరకాల సదుపాయాలు కల్పించింది. ముఖ్యంగా సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పర్యటకులు జంగిల్ సఫారీని ఆస్వాదిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాల్లో ములుగు ఒకటి. ఇక్కడ పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు అటవీశాఖ రకరకాల మార్గాలను అన్వేషించింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం ములుగు నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడి అభయారణ్యంలో అనేక రకాల జంతువులు ఉంటాయి.
ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు తాడ్వాయి మండలంలో జంగిల్ సఫారీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏకంగా 22 లక్షల విలువైన రెండు వాహనాలను కొనుగోలు చేశారు.. పర్యాటకుల దగ్గర 500 చొప్పున తీసుకొని.. 36 కిలోమీటర్ల మేర అడవుల్లో తిప్పుతున్నారు. అభయారణ్యంలో ఉన్న అడవులలో అందాలను దగ్గరుండి చూపిస్తున్నారు. ఒక్కో వాహనంలో పదిమంది కూర్చునే అవకాశం ఉంది.
జంగిల్ సఫారీ లో భాగంగా పర్యాటకులు విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నారు.. తాడ్వాయి, ఏటూరు నాగారం 163 నేషనల్ హైవే నుంచి 8 కిలోమీటర్లు అడవిలోకి తీసుకెళ్తున్న అధికారులు.. అక్కడి నుంచి అభయారణ్యం మొత్తాన్ని చూపిస్తున్నారు. అడ్డగుట్ట మీద నిర్మించిన పగోడా నుంచి అటవీ అందాలను పర్యాటకులు చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. పస్రా మార్గంలోని పీకాక్ పోర్టును చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అడవిని చూసేందుకు ఎత్తైన వాచ్ టవర్ నిర్మించారు. ఈ ప్రాంతంలో నెమళ్లు అరుపులతో సందడి చేస్తున్నాయి. మరో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది దట్టమైన అడవిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఐలాండ్. హైదరాబాదు నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రకృతి ప్రియులు కూడా ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు.
