Araku : ఆంధ్ర ఊటీ అరకు.. మంచు ముసుగు ఆహ్లాదాన్ని పంచుతోంది. దట్టంగా కురిసే పొగ మంచు కనువిందు చేస్తోంది. అక్కడి ప్రకృతి సోయగాలు మనసుకు హత్తుకుంటున్నాయి. తెల్లవారుతుండగా మంచు తిరగడం చీల్చుకుని ఉదయభానుడు తొంగి చూస్తుంటే ఆ దృశ్యాల అనుభూతే వేరు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో పర్యాటకుల తాకిడి అరకు పెరిగింది. మేఘాల కొండలైన వంజంగి, మాడగడకు పర్యాటకులు పోటెత్తారు. అక్కడ అందాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో మన్యం ప్రాంతమంతా గజ గజ వణుకుతోంది. మరోవైపు అరకు ప్రాంతానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. స్నేహితులు కుటుంబ సభ్యులతో ప్రకృతి అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
* ప్రత్యేక ఆకర్షణగా సోయగం
ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది మాడగడ కొండ. అక్కడ సూర్యోదయాన్ని తిలకించేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. పాలమీగడ లాంటి తెల్లటి మేఘాల మధ్య సూర్యోదయాన్ని తిలకిస్తుంటే ఆ ఫీలింగ్ అనుభవించాలి తప్ప మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం ఈ కొండపై దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోను చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. ఎంతో అబ్బురపరిచేలా ఉంది ఆ వీడియో. మరోవైపు ఏజెన్సీ స్పెషల్ బొంగులో చికెన్, అరకు తేనే, వలసి పూల తోటలు, డ్రాగన్ చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
* పర్యాటకుల తాకిడి
అరకు తో పాటు పాడేరు ప్రాంతానికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ప్రధానంగా బొర్రా గుహలు, గిరిజన మ్యూజియం, చాపరాయి జలపాతాలు, ఉదోతల అందాలను ఆస్వాదిస్తూ పర్యాటకులు మైమరిచిపోతున్నారు. అయితే అన్నిటికంటే ఎక్కువగా ఆకర్షిస్తోంది మాత్రంమాడగడ ప్రకృతి సోయగం. కొండల మధ్య పాల కడలిని తలపించేలా.. భూతాల స్వర్గాన్ని మైమరిపించేలా మెస్మరైజ్ చేస్తోంది ఆ ప్రాంతం.