
తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షం సృష్టించిన భీభత్సం అంతాఇంతా కాదు. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురవగా హైదరాబాద్ రోడ్లు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. రాష్ట్రంలో 70 మందికి పైగా వర్షాలు, వరదల వల్ల మృతి చెందినట్టు తెలుస్తోంది.
సీఎం కేసీఆర్ భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయసహకారాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచనలు చేశారు. ముంపు ప్రాంతాల్లో బియ్యం, పప్పు, ఇంటికి మూడు చొప్పున రగ్గులు, నిత్యావసర సరుకులు, ఆహారం అందించాలని సూచనలు చేశారు. జీహెచ్ఎంసీకి సహాయ కార్యక్రమాల కొరకు తక్షణమే 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు కీలక ప్రకటన చేశారు.
వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. పూర్తిగా ఇళ్లు కూలిపోయిన వాళ్లకు కొత్త ఇళ్లు మంజూరు చేయడంతో పాటు పాక్షికంగా ఇళ్లు కూలిపోయిన వాళ్లకు ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు. నాలాలపై కట్టిన ఇళ్లు కూలిపోతే ప్రభుత్వ స్థలాల్లో కొత్త ఇళ్లు కట్టిస్తామని కీలక ప్రకటన చేశారు.
అపార్టుమెంట్ల సెల్లార్లలో, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో నేడు ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ ఆదేశాలను జారీ చేశారు. జీహెచ్ఎంసీలో పరిస్థితిని చక్కదిద్దడం గురించి ప్రత్యేకంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.