కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకముద్ర వేస్తున్నారు. ఎప్పటికప్పుడు వేడివేడి వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో నిత్యం కనిపిస్తూనే ఉన్నారు. ఏదో ఒక అంశంపై తనదైన వ్యాఖ్యలు చేస్తూ జనం నోళ్ళల్లో నానుతూనే ఉన్నారు. మద్యం కుంభకోణంలో ప్రధాన అభియోగాలు ఎదుర్కోవడం.. ఢిల్లీ తీహార్ జైల్లో ఉండడం.. బెయిల్ మీద బయటకు రావడం.. భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెన్షన్ వేటు ఎదుర్కోవడం.. ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేయడం.. ఇవన్నీ కవిత రాజకీయ జీవితంలో ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మార్పులు.
భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత రాజకీయంగా దూకుడు పెంచారు. తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశారు. దీనికి సంక్షిప్తంగా టీఆర్ఎస్ అని పేరు ఖరారు చేశారు. టిఆర్ఎస్ కు తెలంగాణ ఉద్యమంతో బలమైన సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం నేపథ్యంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషించింది. ఢిల్లీలో చక్రాలు తిప్పాలని కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త భారత రాష్ట్ర సమితి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో.. పార్లమెంటు ఎన్నికల్లో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
కవిత భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశారు. ఆ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేపడుతున్నారు. కవిత ఇంతటితోనే ఆగడం లేదు. అంతకుమించి అనే స్థాయిలోనే ఉద్యమకారులతో.. వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో జరిగిన అన్యాయం గురించి తెలుసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.
తెలంగాణ రక్షణ సేనకు టిఆర్ఎస్ అనే పేరు కేటాయించడం పట్ల ఇటీవల భారత రాష్ట్ర సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం వరకు వెళ్లారు. ఎన్నికల సంఘం తనకు వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావిస్తూ కవితకు లేఖ రాసింది. తెలంగాణ రక్షణ సేనకు టిఆర్ఎస్ పేరు ఇవ్వడం కష్టమని అభిప్రాయపడింది. దీనిపై న్యాయపోరాటానికి కవిత సిద్ధమయ్యారు. అంతేకాదు భారత రాష్ట్ర సమితి అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. “కొద్దిరోజులుగా కొంతమంది నా మీద విషం చిమ్ముతున్నారు. టిఆర్ఎస్ అనే పేరును నాకు రాకుండా కుట్రలు చేస్తున్నారు. గులాబీ పార్టీకి ఒక నీతి అనేది లేదు. మేము అంటూ లేదు. తల్లి చెల్లి అనే సభ్యత మరిచి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారని.. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారని.. అటువంటి పార్టీలోకి వెళ్లడం సాధ్యం కాదని.. నా కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ భారత రాష్ట్ర సమితిలో చేరేది లేదని” కవిత స్పష్టం చేస్తున్నారు.
కవిత ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ నుంచి మొదలుపెడితే సంతోష్ రావు వరకు ఎవరిని కూడా ఆమె వదిలిపెట్టడం లేదు. చివరికి హరీష్ రావును ఆమె గుంట నక్క అన్ని సంబోధిస్తున్నారు. అంతేకాదు సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా ఆమె పర్యటిస్తూ.. కేటీఆర్ చేస్తున్న తప్పులను ఎండ గడుతున్నారు. మొత్తంగా భారత రాష్ట్ర సమితికి ఆమె కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేని పని కవిత చేస్తూ.. తెలంగాణ ప్రజల్లో సరికొత్త చర్చకు కారణమవుతున్నారు. కవిత ఇదే దూకుడు కొనసాగిస్తారా.. ఇలాగే భారత రాష్ట్ర సమితి మీద పోరాటం చేస్తారా.. అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది గాని.. ఇప్పటికైతే కవిత ఒక అగ్గి బరాటా మాదిరిగా పోరాటం చేయడం తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలకు ఆనందం కలిగిస్తుంటే.. గులాబీ నాయకులకు మాత్రం కలవరపాటును కలగజేస్తోంది.
