India China Imports : భారత సరిహద్దులోని గాల్వన్ వద్ద 2020లో జరిగిన ఘర్షణ తర్వాత చైనా దిగుమతులను భారత్ చాలా వరకు తగ్గిస్తూ వచ్చింది. వందల యాప్స్‌ను నిషేధించింది. దేశీయంగా ఉత్పత్తులు పెంచింది. తద్వారా భారత సంపద పెంచింది. అనేక రంగాల్లోని ఉత్పత్తుల దిగుమతులకు అవసరమైన అనుమతులు నిలిపివేయడంతో వాణిజ్య పరంగా ఇరుదేశాల సంబంధాలు మందగించాయి. మొబైల్ ఫోన్ పార్ట్స్, గృహ వినియోగ వస్తువులు, స్టీల్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, షూస్ వంటి వస్తువుల సరఫరా అంతరాయం ఏర్పడింది.
మళ్లీ అనుమతులు..
ఇటీవల రెండు దేశాల మధ్య ఇటీవల సత్సంబంధాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా మార్పు దిశగా అడుగులు వేస్తోంది. భారత వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖలోని పారిశ్రామిక ప్రోత్సాహ విభాగం కంపెనీలను సంప్రదించి విదేశీ ప్లాంట్ల సర్టిఫికేషన్‌లో జరుగుతున్న ఆలస్యాలపై వివరాలు అడిగింది. దీని వలన చైనా సహా అనేక దేశాల పరిశ్రమలకు తిరిగి భారత్ మార్కెట్ చేరుకునే అవకాశం లభిస్తోంది. దేశీయంగా పండుగ సీజన్‌లో ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల డిమాండ్ ఆకాశాన్ని తాకింది. వినియోగదారులు తగ్గిన జీఎస్టీ రేట్లతో కొనుగోళ్లలో ఉత్సాహంగా ఉండటంతో స్థానిక తయారీదారులు నిల్వల కొరతను ఎదుర్కొంటున్నారు. ఫ్రీజర్లు, వాషింగ్ మెషిన్లు, పెద్ద టెలివిజన్లు వంటి ఉత్పత్తులకు వేచిచూడవలసిన పరిస్థితి ఏర్పడటంతో దిగుమతులు వేగవంతం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
ఏఐ అనుమతుల ప్రాధాన్యం
నాణ్యత నియంత్రణ ఆదేశాల (క్యూసీవో) కింద ఉన్న ఉత్పత్తుల దిగుమతులకు భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) సర్టిఫికేషన్ తప్పనిసరి. దీనికి సంబంధించి విదేశీ తయారీ యూనిట్లను ఏఐ బృందం ప్రత్యక్షంగా పరిశీలిస్తుంది. దేశీయ ప్లాంట్లకు అప్రూవల్ వేగంగా లభించినా, చైనాలోని ఫ్యాక్టరీలకు ఆలస్యం కావడం సరఫరా గొలుసులకు ఆటంకం కలిగించింది. నూతన నిర్ణయం ఈ అడ్డంకిని తగ్గించే దిశగా ఉంది.
మళ్లీ పుంజుకుంటున్న సంబంధాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టులో చైనాను సందర్శించిన తర్వాత ఇరుదేశాల మధ్య కొత్త దౌత్య వాతావరణం ఏర్పడింది. రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు తిరిగి ప్రారంభం కాగా, చైనా వ్యాపారవీసాలకు కూడా భారత్ అనుమతులు ఇస్తోంది. అంతకుముందు చైనా ఆరు నెలల విరామం తర్వాత హేవీ రేర్ ఎర్త్ మాగ్నెట్ల ఎగుమతులు పునఃప్రారంభించడం ద్వారా పరిశ్రమలపై ఒత్తిడి తగ్గింది. దీనితో భారత్–చైనా వాణిజ్య సంభాషణలు మళ్లీ ముడిపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
స్వదేశీకరణ లక్ష్యం కొనసాగిస్తూనే..
ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రణాళిక కింద స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాను పెంచాలనే ప్రయత్నం కొనసాగుతున్నా, స్థానిక సంస్థల ఉత్పత్తి సామర్ధ్యం పూర్తిగా సరిపోవడం లేదు. ఉదాహరణకు ఎయిర్‌కండీషనర్లలో దాదాపు 50 శాతం భాగాలు విదేశాల నుంచే వస్తున్నాయి. ఈ లోటును తీర్చేందుకు చైనా ఫ్యాక్టరీల నుంచి అనుమతుల పునరుద్ధరణ ప్రస్తుత అవసరంగా మారింది.
మొత్తంగా భారత్ విధానం ఇప్పుడు రెండు దిశలలో సాగుతోంది – ఒకవైపు స్థానిక తయారీకి ప్రాధాన్యం, మరోవైపు పండుగ సీజన్ డిమాండ్‌కు తక్షణ సప్లై ఏర్పాట్లు. చైనా దిగుమతుల పునరుద్ధరణ తాత్కాలిక పరిష్కారమే అయినప్పటికీ, ఇది వాణిజ్య సహకారాన్ని పునరుద్ధరించే దిశగా కీలక అడుగు.