Indian Express IE100 2026 : తెలుగు రాష్ట్రాల నాయకులు మరోసారి తమ సత్తా చాటుకున్నారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించారు. ప్రఖ్యాత జాతీయ దినపత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ( Indian Express) తాజాగా ప్రకటించిన ‘IE 100’: 2026 పేరుతో అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాను ప్రకటించింది. అందులో తెలుగు ప్రముఖులకు చోటు దక్కింది. దేశ గమనాన్ని శాసించగల వందమంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో తెలుగు నేతలకు అగ్రతాంబూలం దక్కడం విశేషం. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ జాబితాలో ఉన్నారు. అందరికంటే మెరుగైన స్థితిలో ఏపీ సీఎం చంద్రబాబు ఉండడం విశేషం.
* 13వ స్థానంలో ఏపీ సీఎం..
దేశంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులను ఈ జాబితాలో చేర్చారు. అందులో ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu) 13వ స్థానంలో నిలవడం విశేషం. అత్యంత శక్తివంతమైన తెలుగు నాయకుడిగా ఆయన తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం, ఏపీ పునర్నిర్మాణంలో ఆయన చూపుతున్న చొరవ జాతీయ స్థాయిలో సైతం గుర్తింపు పొందింది. ఇక తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఈ జాబితాలో 25వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత అత్యంత ప్రభావశీలుడైన నేతగా రేవంత్ గుర్తింపు సాధించారు. మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ వంటి సీనియర్లను వెనక్కి నెట్టి రేవంత్ రెడ్డి ఈ జాబితాలో ముందంజలో ఉండడం విశేషం.
* పవన్ కళ్యాణ్ సైతం..
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) 68వ స్థానంలో నిలిచారు. మరోసారి తన గ్లామర్‌ను నిరూపించుకున్నారు. జాతీయస్థాయిలో మంచి నాయకుడిగా గుర్తింపు పొందారు. కేంద్ర మంత్రి గింజరాపు రామ్మోహన్ నాయుడు సైతం 90 స్థానంలో నిలిచారు. కేంద్ర క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి యువనేతగా ఎంపికైన ఆయన మంచి వాగ్దాటితో ముందుకు సాగుతున్నారు. అయితే ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి ఒక్కరంటే ఒక్క నేతకు కూడా ఈ జాబితాలో స్థానం దక్కకపోవడం విశేషం. ఒకప్పుడు అద్భుత విజయంతో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అదే స్థాయిలో ఓటమితో దారుణంగా దెబ్బతిన్నారు రాజకీయంగాను. అయితే ఒక జాతీయ పత్రిక ప్రకటించిన జాబితాలో ఆ రెండు పార్టీలకు ఇప్పుడు చోటు దక్కకపోవడం మాత్రం నిజంగా లోటు.