AP Rains : ఏపీలో చలి ముదిరింది. విపరీతమైన మంచు కురుస్తోంది. చలి గాలులు సైతం వీస్తున్నాయి. పగలంతా ఎండలు మండుతున్నాయి. ఇటువంటి తరుణంలో బంగాళాఖాతం నుంచి ఒక అలెర్ట్ వచ్చింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పాటు.. నిన్న నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉంది.
* ఉపరితల ఆవర్తనం
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీతోపాటు యానంలోని తీర ప్రాంతంలో ఈశాన్య దిశగా గాలులు వీచే అవకాశం ఉంది. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దక్షిణ ఉత్తర కోస్తాలో ఈరోజు, రేపు తేలికపాటి వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* ఈ జిల్లాలకు ఎఫెక్ట్
ప్రధానంగా అల్లూరి సీతారామరాజు, కృష్ణ, నెల్లూరు, అన్నమయ్య, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, బాపట్ల ప్రకాశం పల్నాడు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వరి కోతలకు రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో తుఫాన్ అంటేనే భయపడిపోతున్నారు. రైతుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.