Harshit Rana performance : ఎందుకు అతడిని జట్టులోకి తీసుకుంటున్నారు? వికెట్లు తీయలేడు.. పరుగులు దారుణంగా ఇస్తున్నాడు.. చివరికి స్థిరంగా ఫీల్డింగ్ కూడా చేయలేడు.. ఇటువంటి ఆటగాడిని గౌతమ్ గంభీర్ ఎందుకు మోస్తున్నాడు.. అతని స్థానంలో వేరే వాళ్లకు అవకాశాలు ఇవ్వచ్చు కదా.. కొంతకాలంగా మాజీ క్రికెటర్ల నుంచి మొదలు పెడితే జాతీయ మీడియా వరకు హర్షిత్ రానా మీద ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు.
హర్షిత్ తనను తాను నిరూపించుకోవడానికి గౌతమ్ గంభీర్ ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో హర్షిత్ వాటిని అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యాడు. అయితే ఇన్నాళ్లకు తనలో బౌలర్ మాత్రమే కాదు, బ్యాటర్ కూడా ఉన్నాడని హర్షిత్ నిరూపించుకున్నాడు. అది కూడా జట్టు అత్యంత కష్టంలో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీకి సపోర్ట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ, గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అయ్యర్ వంటి వారు విఫలమైన చోట.. ఒక బౌలర్ గా అతడు నిలబడ్డాడు. ఆ సమయంలో ఆల్ రౌండర్ గా జట్టుకు సేవలు అందించాడు. సూపర్ నాక్ ఆడి అదరగొట్టాడు. ఒకవేళ గనుక విరాట్ కోహ్లీ అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే.. కచ్చితంగా హర్షిత్ మ్యాచ్ స్వరూపాన్ని మరో విధంగా మార్చేవాడు.
ఇండోర్లో జరిగిన మ్యాచ్లో హర్షిత్ ఏకంగా 52 పరుగులు చేశాడు. వన్డే ఫార్మాట్లో అతడికి ఇది హైయెస్ట్ స్కోర్. 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో అతడి ఏకంగా 52 పరుగులు చేయడం విశేషం. 178/6 వద్ద బ్యాటింగ్ కు వచ్చాడు హర్షిత్. మొదట్లో నిదానంగా ఆడిన అతడు.. ఆ తర్వాత జోరు చూపించాడు. జమీసన్ వేసిన 43 ఓవర్లో విరాట్, హర్షిత్ ఏకంగా 21 పరుగులు రాబట్టారు. అయితే ఆ తర్వాత ఓవర్ లోనే వరుస బంతులలో హర్షిత్, సిరాజ్ అవుట్ అయ్యారు. అయితే చివరిదాకా విరాట్ పోరాడినప్పటికీ భారత జట్టుకు అనుకూలమైన ఫలితం రాలేదు. ఏది ఏమైనప్పటికీ ఈ మ్యాచ్ ద్వారా హర్షిత్ తనను తాను నిరూపించుకున్నాడు.
బంతి ద్వారా మాత్రమే కాకుండా, బ్యాట్ ద్వారా కూడా తను విలువైన ఆటగాడినని నిరూపించుకున్నాడు. హర్షిత్ కు ఇంకా అవకాశాలు ఇవ్వాలని.. అతడిని బౌలర్ గా మాత్రమే కాకుండా.. బ్యాటర్ గా కూడా మార్చాలని.. అప్పుడే టీమిండియా కు విలువైన ఆల్రౌండర్ లభిస్తాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ” భారత జట్టుకు మిగతా విషయాల్లో ఏమాత్రం సానుకూలంగానే ఫలితాలు వస్తున్నాయి. కానీ, హర్షిత్ విషయంలో గౌతమ్ గంభీర్ తీసుకున్న నిర్ణయం జట్టుకు సానుకూలమైన ఫలితాన్ని అందిస్తోందని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
