నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా “లవ్ స్టోరి”. ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ “లవ్ స్టోరి” కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 24న “లవ్ స్టోరి” థియేటర్ రిలీజ్ కు సిద్ధమవుతున్న సందర్భంగా సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ సినిమాకు పనిచేసిన అనుభవాలు, తన కెరీర్ విశేషాలు తెలిపారు.
పవన్ సీహెచ్ మాట్లాడుతూ….మాది సినిమా ఫ్యామిలీ. మా నాన్నగారు విజయ్, తాతగారు సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్. అలా చదువులు పూర్తయ్యాక మ్యూజిక్ అకాడెమీలో సంగీతం నేర్చుకున్నాను. కీబోర్డ్, ఇతర సంగీత పరికరాల గురించి నైపుణ్యం తెచ్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో రెహమాన్ గారు నా పాటలు విని, వచ్చి కలవమని అన్నారు. నా సంగీతం, కంపోజిషన్ ఆయనకు బాగా నచ్చాయని చెప్పి సహాయకుడిగా పెట్టుకున్నారు.
అలా రెహమాన్ గారితో శివాజీ, రోబో, సర్కార్ తదితర చిత్రాలకు పనిచేశాను. ఫిదా సినిమా టైమ్ నుంచి దర్శకుడు శేఖర్ కమ్ముల గారి దగ్గర పనిచేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చాను. ఫిదాకు నేను పంపిన పాటలు ఆయనకు నచ్చినా, ఆ సినిమా చాలా ఇంపార్టెంట్ అని, కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారు. కానీ ఆయనతో టచ్ లో ఉన్నాను. లవ్ స్టోరి సినిమాకు శేఖర్ కమ్ముల గారు పిలిచి అవకాశం ఇచ్చారు. ముందు కొన్ని సందర్భాలు చెప్పి ట్యూన్స్ చేయమన్నారు. ఆ తర్వాత నువ్వు సినిమాకు పనిచేస్తున్నావ్ అని చెప్పి సర్ ప్రైజ్ చేశారు. అప్పటిదాకా చేసిన పాటలన్నీ బ్యాంక్ లా పనికొచ్చాయి. ఒక మూడ్ లో అందరం పనిచేసుకుంటూ వచ్చాం. కానీ మా పనికి లాక్ డౌన్ వల్ల బ్రేక్ పడింది. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం. అన్నారు.